ఆ కార్మికుల కోసం పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్: సన్నాహాల్లో జనసైన్యం..రెస్పాన్స్ వస్తుందా?
Recommended Video
ఏపీలో ఇసుక కొరత తీవ్రంగా వేధిస్తోంది.ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక తాజాగా భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యల బాట పడుతున్న పరిస్థితి కూడా ఏపీలో నిర్మాణరంగ పరిస్థితికి అద్దం పడుతుంది. ఈ నేపధ్యంలోనే పవన్ కళ్యాణ్ నిర్మాణ రంగ కార్మికుల కోసం లాంగ్ మార్చ్ నిర్వహించనున్నారు.
3న విశాఖలో జనసేన లాంగ్ మార్చ్
ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి కొత్త ఇసుక పాలసీ ప్రవేశపెడతామని, పాత ఇసుక పాలసీని రద్దు చేయడంతో కొరత ఏర్పడింది. ఇక ఆ తర్వాత కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా నేటి వరకు ఇసుక కొరత ఏపీ ప్రజలను వేధిస్తూనే ఉంది. దీంతో లక్షల సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు బజారున పడుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. కృత్రిమ కొరతను నివారించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని, భవన నిర్మాణ కార్మికులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇదే అంశంతో భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులపై నిరసన గళం విప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే నెల 3న విశాఖలో లాంగ్ మార్చ్ పేరిట భారీ నిరసన ప్రదర్శనను చేపట్టనున్నారు.
సన్నాహాలు మొదలుపెట్టిన జనసైన్యం..30న పోస్టర్ ఆవిష్కరణ
పవన్ లాంగ్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జన సైన్యం సన్నాహాలు మొదలుపెట్టారు. పవన్ లాంగ్ మార్చ్ పై ఏపీ లో భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఏర్పాట్లు సైతం అదే రేంజిలో చెయ్యాలని జనసేన భావిస్తోంది. వచ్చే నెల 3న జరగనున్న లాంగ్ మార్చ్ కు సంబంధించిన పోస్టర్లను పవన్ ఈ నెల 30న ఆవిష్కరించనున్నారు. ఇక లాంగ్ మార్చ్ నేపథ్యంలో రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ అయ్యి లాంగ్ మార్చ్ సన్నాహాలపై చర్చించి ఈ ప్రకటన చేశారు.
ఏపీ ప్రభుత్వ విధానాలపై జనసేన నాన్ స్టాప్ పోరాటం
గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి ఒకే ఒక అభ్యర్థి విజయం సాధించారు. ఏకంగా పవన్ కళ్యాణ్ సైతం రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల ఫలితాలతో జనసేన పార్టీ కనుమరుగవుతుందని అందరూ భావించినా పవన్ కళ్యాణ్ మాత్రం ఊపిరి ఉన్నంతవరకు జనసేన పార్టీని నడిపిస్తానని తేల్చిచెప్పారు. ఇక తాజాగా ఏపీలో ఏర్పడిన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పవన్ కళ్యాణ్ నాన్ స్టాప్ గా పోరాటానికి సిద్ధమయ్యారు. ఏదేమైనా భవన నిర్మాణ కార్మికుల కోసం పెద్ద ఎత్తున లాంగ్ మార్చ్ నిర్వహించి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయాలని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్.

జనసేన నేతలు, క్యాడర్ పెద్దగా లేని విశాఖలో లాంగ్ మార్చ్
అయితే జనసేన పార్టీ ప్రస్తుత పరిస్థితి, కీలక నేతలు పార్టీని వీడి వెళ్ళడం, గత ఎన్నికల్లో జనసేన పార్టీ పెద్దగా రాణించలేక పోవడం వంటి అనేక కారణాలు పవన్ ఏ మేర ఈ లాంగ్ మార్చ్ ను రక్తి కట్టిస్తారో అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇదిలా ఉంటే లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్న విశాఖలో పవన్ పార్టీకి చెప్పుకోదగిన నాయకులు కానీ, క్యాడర్ కానీ లేరు. విశాఖ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కూడా ఓటమిపాలైన నాటినుండి పెద్దగా జనసేన కార్యక్రమాల్లో పాలుపంచుకున్నది లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ లో సైతం ఆయన పాల్గొంటారా లేదా అనేది ఆసక్తికర అంశమే.

పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ సక్సెస్ అవుతుందా ?
ఇక్కడ గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ సైతం ఘోర ఓటమి చవిచూశారు. మొత్తంగా విశాఖనగరంలో జనసేనకు ప్రజా మద్దతు తక్కువని గత ఎన్నికల ఫలితాలతో అర్థమైంది. ఇక ఈ నేపధ్యంలో విశాఖ లాంగ్ మార్చ్ ను పవన్ ఎలా సక్సెస్ చేస్తారన్న విషయం ఆసక్తికరమే. ఏదేమైనా తనతో ఎవరు వచ్చినా, రాకపోయినా పవన్ కళ్యాణ్ మాత్రం తాను చేయాలనుకున్నది చేసి తీరుతారు. నిర్మాణ రంగ కార్మికుల కోసం లాంగ్ మార్చ్ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications