థియేటర్లలో పవన్ స్పీచ్ 'షో', 28 కేంద్రాల్లో: స్టార్ గుర్తు?

అయితే వీటిని రేపటి సభలోనే పవన్ బహిర్గతం చేయనున్నారని సమాచారం. అజెండా మొత్తాన్ని కాకుండా స్థూలంగా పార్టీ లక్ష్యం, విధానాలు ఆయన ప్రకటించనున్నారట. సభలో పవన్ ఇచ్చే ప్రసంగాన్ని రాష్ట్రంలోని కొన్ని సినిమా థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కూడా చర్చలు జరుగుతున్నాయట. దీని కోసం థియేటర్ల యజమానులతో పవన్ కల్యాణ్ సన్నిహితులు మాట్లాడినట్లుగా సమాచారం. హైదరాబాద్‌కు భారీగా తరలి వచ్చేందుకు అభిమానులు సన్నాహాలు చేసుకుంటున్నారు. పలు థియేటర్లలో ఫస్ట్ షో పవన్ ప్రసంగమే ఉండనుంది.
మరోవైపు పవన్ అభిమానులు కూడా ఎక్కడికి అక్కడ భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసుకొని పవన్ ప్రసంగాన్ని చూసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీని ప్రకటించిన తర్వాత నాలుగైదు రోజులు హైదరాబాదులోనే ఉండి పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్తారని, రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారని అంటున్నారు.
యువతలో ఆసక్తి
పవన్ కళ్యాణ్ కొత్త పార్టీపై ప్రజల్లో, ప్రత్యేకించి యువతలో ఆసక్తి పెరుగుతోంది. పవన్ పార్టీ అజెండా ఏమిటి? ఆయన పార్టీ జెండా ఎలా ఉండబోతోంది? వంటి విషయాలపై ఉత్సుకత అందరిలో నెలకొంది. జెండాపై నక్షత్రం గుర్తు ఉంటుందని మాత్రం చెబుతున్నారు.
పార్టీ వెనుక సినీ పెద్దలు
పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం వెనుక కొందరు సినీ పెద్దల హస్తం కూడా ఉన్నట్టు వినికిడి. మంచి వక్త అయిన పవన్ కళ్యాణ్ తొలి దశలో ఎంపిక చేసిన సీట్లలో పోటీ చేసి ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి భవిష్యత్తులో పార్టీని పూర్తి స్థాయిలో నిర్మించాలని యోచిస్తున్నారు. 2008లో చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ విఫలమైనప్పటికీ పవన్ కళ్యాణ్ పార్టీ మాత్రం హిట్టవుతుందనే అభిమానులు ఆశిస్తున్నారు.
ప్రశ్నించే హక్కు కోసం అనే కొత్త నినాదంతో జనంలోకి పవన్ కళ్యాణ్ వస్తున్నారు. పవన్ తనకు నచ్చని విషయాన్ని ఎంత సూటిగా, ఘాటుగా వ్యక్తపరుస్తారో, నచ్చిన విషయాన్ని కూడా అంతే సరదాగా పంచుకుంటారని అభిమానులంటున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, తదితర సామాజిక వెబ్‌సైట్లలో పవన్ కళ్యాణ్ పేరు మార్మోగుతోంది. పవన్ పార్టీ పెట్టడం వెనుక సినీ నిర్మాత త్రివిక్రమ్ హస్తం ఉన్నట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
28 కేంద్రాల్లో స్పీచ్ లైవ్
పవన్ కల్యాణ్ జనసేన పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రేపు హైదరాబాదు మాదాపూర్ లోని హైటెక్స్ లో సమావేశం జరగనుంది. ఈ సమావేశం ప్రత్యక్ష ప్రసారానికి అభిమానులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సీమాంధ్ర, తెలంగాణలోని 28 కేంద్రాల్లో పవన్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం కానుంది. రాజమండ్రి, కాకినాడ, నర్సాపురం, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, నర్సాపురం, ఏలూరు, అనంతపురం తదితర 28 ప్రాంతాల్లో స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications