వారికోసం వందరోజుల ప్రణాళిక.. పవన్ కళ్యాణ్ మాట తప్పడు, మడమ తిప్పడు!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో ఉప్పాడ లో పర్యటించిన విషయం తెలిసిందే. ఉప్పాడ మత్స్యకార కుటుంబాలకు తాను అండగా ఉంటానని, వారి సమస్యలు పరిష్కరిస్తానని వందరోజుల సమయం ఇవ్వాలని కోరిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఉప్పాడ పైన దృష్టి సారించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో పరిస్థితులపై అధ్యయనం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
మత్స్యకారుల సమస్యలపై వంద రోజుల ప్రణాళిక
కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష సమావేశంలో ఆయన కీలక అంశాలను ప్రస్తావించారు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని తీర ప్రాంతంతో పాటు కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం, నివారణకు అనుసరించాల్సిన ప్రణాళికల విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పారిశ్రామిక వ్యర్ధాల నిర్వహణ ప్రక్రియలో పర్యవేక్షణలో పారదర్శకంగా వ్యవహరించాలని, వందరోజుల ప్రణాళికతో మత్స్యకారుల సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించాలని దిశానిర్దేశం చేశారు.

ఉప్పాడ పరిస్థితులపై తక్షణ అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలన్న పవన్
కాకినాడ జిల్లాలో తీసుకోబోయే కాలుష్య నియంత్రణ చర్యలు దేశానికి మోడల్ కావాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యర్ధాల శుద్ధి ప్రక్రియలో అధునాతన సాంకేతికతను పరిశ్రమలు వినియోగించాలని ఆయన కోరారు. ఇటీవల ఉప్పాడ తీర ప్రాంతంలో మత్యకారులు ఆందోళన చెందుతున్న క్రమంలో, అక్కడ పరిస్థితులపైన తక్షణ అధ్యయనం చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు. సమస్య ఉన్న పరిశ్రమల్లో పొల్యూషన్ ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు.
అధికారులతో పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణపై చర్చించిన పవన్
దానికోసం అనుసరించాల్సిన విధి విధానాల పైన పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు. పారిశ్రామిక వ్యర్ధాల నిర్వహణ, కాలుష్య నియంత్రణ మండలిలో సిబ్బంది కొరత, కాకినాడలో మత్స్యకారులతో జరిగిన 'మాట.. మంతి' కార్యక్రమంలో మత్స్యకారులు ప్రస్తావించిన సమస్యలు తదితర అంశాలు ఈ సమీక్షలో పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగంతో చర్చించారు.
సిబ్బంది కొరతపై చంద్రబాబుతో చర్చిస్తా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తుందని, కొత్త కొత్త పరిశ్రమలు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకుంటున్నాయి అని పేర్కొన్న ఆయన, పెరుగుతున్న పరిశ్రమలతో పాటు ప్రజలలో ఆందోళనలు, సందేహాలు చోటుచేసుకుంటున్నాయి అన్నారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సిబ్బంది కొరత సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురాగా అవసరాలకు అనుగుణంగా సిబ్బంది నియామకం చేపట్టే అంశం పైన ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తామన్నారు.
పారిశ్రామిక వేత్తలకు పవన్ కళ్యాణ్ సలహా
ప్రస్తుతం మన సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వర్గాలు కూడా ఉత్తమ పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం పైన దృష్టి సారించాలని, కాలుష్యాన్ని తగ్గించే విధానాలను అనుసరించాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అవసరమైతే పర్యావరణ వేత్తలను ఆహ్వానించి తగిన సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications