చంద్రబాబు ఇంట్లో పవన్! ఢిల్లీలో పురందేశ్వరి! బీజేపీ ప్రకటనపై ఉత్కంఠ!
ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని భావిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు చర్చల్లో చరమాంకానికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చించి వచ్చిన చంద్రబాబు, మరోసారి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. అంతకు ముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తన నివాసంలో చర్చలు జరిపారు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని నాలుగు ఎంపీ సీట్లతో పాటు ఆరు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని టీడీపీ, జనసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన బీజేపీ అధిష్టానం ముందు ఉంచి ఫైనల్ చేసుకునేందుకు రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే అంతకు ముందే ఇదే అంశంపై బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనూ చంద్రబాబు ఇవాళ చర్చించారు. పవన్ ఉదయం చంద్రబాబు నివాసానికి వెళ్లి పలు అంశాలపై చర్చలు జరిపారు.

అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సైతం టీడీపీ, జనసేనతో పొత్తుపై చర్చించేందుకు ఢిల్లీ పెద్దల్ని కలిసేందుకు బయలుదేరి వెళ్లారు. ఇవాళ హైకమాండ్ తో చర్చించి పొత్తును ఆమె ఫైనల్ చేసుకోవచ్చని తెలుస్తోంది. అనంతరం రేపు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి దీన్ని ఖరారు చేసుకుంటారని సమాచారం. ఈ మేరకు పురందేశ్వరి టూర్ లో అమిత్ షాతో పాటు జేపీ నడ్డా, ఇతరుల్ని కలిసే అవకాశాలున్నాయి.
మరోవైపు పవన్ కళ్యాణ్ ఇవాళ చంద్రబాబుతో జరిపిన చర్చల్లో జనసేన రెండో జాబితా విడుదలతో పాటు ఇరు పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదలపైనా చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిన్న జరిగిన జయహో బీసీ సభలో బీసీ డిక్లరేషన్ ను విడుదల చేసిన ఇరువురు నేతలు.. ఇప్పుడు మ్యానిఫెస్టోను సైతం ఉమ్మడిగానే విడుదల చేయనున్నారు. త్వరలో తిరుపతి లేదా అమరావతిలో సభ పెట్టి మ్యానిఫెస్టో విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. బీజేపీతో పొత్తు ఫైనల్ అయితే ఆ పార్టీ నేతలతో కూడా కలిసి ఈ ఉమ్మడి మ్యానిఫెస్ట తయారు చేసి విడుదల చేసే అవకాశముంది.












Click it and Unblock the Notifications