ఇదెక్కడి న్యాయం జగన్.. ఆ వైఫల్యాలను పవన్ కళ్యాణ్ తూర్పారబడుతున్నారుగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని కృత నిశ్చయంతో ఉన్న పవన్ కళ్యాణ్ ఎండను సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా పిఠాపురం నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించిన పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. జగన్ పాలనపై నిప్పుల వర్షం కురిపించారు.
పట్టాదారు పాసు పుస్తకాలపై రాజముద్ర ఉండాలి కానీ జగన్ ఫోటో ఏమిటి?
ఈరోజు పి దొంతమూరు వెల్దుర్తి సెంటర్లో ఎన్నికల రోడ్ షో నిర్వహించిన పవన్ కళ్యాణ్ వైసీపీపై, జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాదారు పాసు పుస్తకాలపైన జగన్ ఫోటోలు ముద్రించడంపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. మన భూముల పట్టాదారు పాసు పుస్తకాలపై రాజముద్ర ఉండాలి కానీ జగన్ ఫోటో ఏమిటంటూ ప్రశ్నించారు.

ఇది నా ఆస్తి అని మనం రుజువు చేసుకోవాలా?
ఇకపై ఆస్తులకు సంబంధించి దస్తావేజులు ఉండవని, అన్ని సర్వర్ లోనే ఉంటాయని జగన్ చెబుతున్నారని పేర్కొన్న పవన్ కళ్యాణ్ వైసిపి మళ్ళీ అధికారంలోకి వస్తే మనందరి ఆస్తులు పోతాయి అంటూ వ్యాఖ్యలు చేశారు. మన ఆస్తికి సంబంధించిన పత్రాలు మన దగ్గర ఉండాలని, అలా కాకుంటే ఇది నా ఆస్తి అని మనం రుజువు చేసుకోవాలా .. ఇది ఎక్కడ న్యాయం అంటూ ప్రశ్నించారు.
జగన్ పోలవరం ప్రాజెక్ట్ ను సర్వనాశనం చేశారు
కష్టపడి సంపాదించుకున్న ఆస్తులకే దిక్కు లేనప్పుడు అసైన్డ్, డి ఫారం పట్టా భూములను వైసిపి నాయకులు మిగులుస్తారా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇక పోలవరం ప్రాజెక్టును జగన్ సర్వనాశనం చేశారని, పురుషోత్తం పట్నం ఎత్తిపోతల పథకానికి నిధులు లేవంటూ పంటలు ఎండబెడుతున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ఓటమి ఖాయం
ప్రభుత్వ ఆస్తులు, వనరులు అన్నింటిని సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ద్వారంపూడి ఇలాంటి వారికి జగన్ పంచి పెడుతున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. నీటి సమస్య లేకుండా ఉండాలంటే ప్రాజెక్టులు పూర్తి కావాలని, మళ్లీ జగన్ కు అధికారం కట్టబెడితే ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితి లేదన్నారు. వైసిపి ఫ్యాన్ రెక్కలు ఊడిపోయాయి అని ఆ పార్టీ ఓటమి ఖాయమైందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications