నాగబాబు ఎంట్రీతో అనకాపల్లిలో మారిన సీన్ ? కొణతాలకు పవన్ ఆఫర్ ఇదేనా !
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ కు మరోవైపు సొంత పార్టీలో టికెట్ల తలనొప్పి పెరిగిపోతోంది. ముఖ్యంగా ఈసారి తమ కూటమి తరఫున అత్యధిక సీట్లు కైవసం చేసుకోవాలని భావిస్తున్న కోస్తా ప్రాంతంలోని ఉత్తరాంధ్రలో సీట్ల వ్యవహారం పవన్ ను చికాకు పెడుతోంది. తన సీటు కంటే ఇతరుల సీట్ల కోసమే పవన్ కళ్యాణ్ ఎక్కువగా రిస్క్ తీసుకోవాల్సిన పరిస్ధితుల మధ్య ఆయన ఇవాళ విశాఖ పర్యటన ప్రారంభిస్తున్నారు.
నిన్న మొన్నటివరకూ ఉత్తరాంధ్రలో కీలకమైన అనకాపల్లి ఎంపీ సీటుకు పార్టీలో చేరిన సీనియర్ నేత కొణతాల రామకృష్ణ పేరును పవన్ కళ్యాణ్ దాదాపుగా ఖరారు చేసేశారు. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన తన సోదరుడు నాగబాబు కన్ను కూడా ఈ సీటుపైనే పడింది. అదీ ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా వెళ్లాలని భావిస్తున్న నాగబాబు అనకాపల్లిలో తాజాగా జరిగిన పర్యటన, చేసిన హంగామా ఇప్పటికే ఆ సీటును ఆశిస్తున్న కొణతాల రామకృష్ణకు ఇబ్బందిగా మారింది. దీంతో నాగబాబు టూర్ కు ఆయన దూరంగా ఉండిపోయారు.

దీంతో నాగబాబు స్వయంగా కొణతాల రామకృష్ణ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. అనకాపల్లి ఎంపీ సీటులో తాను, ఎమ్మెల్యేగా కొణతాల పోటీ చేస్తే బావుంటుందని సూచించారు. దీనికి ఆయన అంగీకరించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ లో కొణతాలతో భేటీ అయి దీనిపై ఓ పరిష్కారం చేయాలని భావిస్తున్నారు. దీంతో ఇవాళ కొణతాల రామకృష్ణ ఇంటికి వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. అక్కడే నాగబాబును కూడా కూర్చోపెట్టి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లపై తేల్చేసేందుకు జనసేనాని రెడీ అవుతున్నారు. అయితే ఎంపీ సీటుపై ఆశ పెట్టుకున్న కొణతాల ఎమ్మెల్యేగా పోటీకి ఎంతవరకూ అంగీకరిస్తారన్నది చూడాల్సిందే.












Click it and Unblock the Notifications