లైఫ్ట్, రైట్: పవన్ కళ్యాణ్‌ది హైబ్రిడ్ రాజకీయం
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హైబ్రిడ్ రాజకీయం చేయనున్నారు. రైట్, లెఫ్ట్ సిద్ధాంతాల సారాంశాన్ని గ్రహించి హైబ్రిడ్ రాజకీయం చేయాలని ఆయన ఆలోచనగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆలోచనలను పంచుకున్నారు. తాను వామపక్ష భావజాలం నుంచి పక్కకు వెళ్లలేదని, అలాగని రైట్ వింగ్ ఐడియాలజీని తప్పు పట్టనని, రెండింటి సారాంశాన్ని అర్థం చేసుకుని హైబ్రిడ్ రాజకీయం చేయాల్సిందేనని ఆయన అన్నారు.
మరో ఆరు నెలల పాటు పార్టీని నిర్మించడానికి వీలు కాకపోవచ్చునని, చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయాల్సి ఉందని ఆయన అన్నారు. ఓ ఏడాదిలో పార్టీ నిర్మాణం, నాయకుల ఎంపిక పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. రోజూ మీడియాతో మాట్లాడుతూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ లైమ్ లైట్‌లో ఉండడం తన ఒంటికి పడదని ఆయన అన్నారు

బిజెపిలో తన పార్టీని విలీనం చేయబోనని చెప్పారు. అయితే, బిజెపి, తెలుగుదేశం, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేయనున్నాయని మాత్రం చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోయినా వెనక్కి తగ్గబోనని, రాజకీయాల నుంచి పారిపోనని, ఓడిపిన ప్రతిసారీ అనుభవంగా స్వీకరిస్తానని పవన్ కళ్యాణ్ ఆ పత్రికతో చెప్పారు.
చెగువేరా అంతటి వ్యక్తి జీవితంలో ఎన్నో పరాజయాలు చూశారని, అవి చదివి తాను ఎంతో నేర్చుకున్నానని ఆయన చెప్పారు. 2014 ఎన్నికల్లో మోడీ కన్నా మంచి ప్రత్యామ్నాయం తనకు లభించలేదని చెప్పారు. మతకల్లోలాల కారణంగా గుజరాత్ నేల రక్తంతో తడిసిందన్న విషయం తనకు తెలియంది కాదని, కానీ విభజన వల్ల రాష్ట్రంలో కొన్ని కోట్ల హృదయాలు రక్తమోడుతున్నాయని, అది భౌతికంగా బయటకు కనిపించేది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications