కొంప ముంచిన కొడాలి, వంశీ లింకులు-చంద్రబాబుకు సారీ..బోడే ప్రసాద్ కలకలం..!
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ ప్రకటించిన రెండు జాబితాల్లోనూ సీటు దక్కించుకోలేకపోయిన కృష్ణాజిల్లా పెనమలూరు టీడీపీ ఇన్ ఛార్జ్ బోడే ప్రసాద్ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ రాకపోవడానికి కారణంగా ప్రచారం జరుగుతున్న పలు అంశాలపై ఇవాళ క్లారిటీ ఇచ్చారు. పెనమలూరులో తనకు టికెట్ లేదని స్వయంగా చంద్రబాబే ఫోన్ చేసి చెప్పేసినా ఇంకా టికెట్ పై ఆశలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
బోడే ప్రసాద్ కు పెనమలూరు టికెట్ రాకపోవడం వెనుక ఆయనకు పొరుగున ఉన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో ఉన్న సంబంధాలే కారణమని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బోడే ప్రసాద్ కు ఈసారి టికెట్ రాలేదన్న వాదన ఉంది. దీనిపై ఇవాళ బోడే స్పందించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీతో తనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. పార్టీ నేత పట్టాభిపై, గన్నవరంలో పార్టీ కార్యాలయంపై దాడి ప్రయత్నాలు చేస్తున్నారని ముందే చెప్పినట్లు గుర్తుచేశారు. తనకు వంశీ, కొడాలి తో సంబంధాలు ఉంటే ఈ విషయం ఎందుకు చెబుతానని ప్రశ్నించారు.

వంశీ, నానితో సంబంధంలేదని తన పిల్లల మీద బోడే ప్రసాద్ ప్రమాణం చేశారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మీద వంశీ ఆరోపణలు చేసినపుడే సర్వస్వం కోల్పోయావని వంశీకి మెసేజ్ చేసినట్లు బోడే ప్రసాద్ గుర్తుచేసుకున్నారు. పార్టీ కోసం పని చేయటమే తనకు తెలుసన్నారు. పని చేయటం రాని వాళ్ళు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన సీటులో పోటీ చేయటం కోసం ఇలాంటి ప్రచారాలు చేయాలా అని ప్రశ్నించారు.
ఇప్పటికీ టీడీపీ టికెట్ తనకే వస్తుందని నమ్ముతున్నానని బోడే ప్రసాద్ తెలిపారు. అధిష్టానం తీసుకునే నిర్ణయం బట్టి తన పోటీ ఆధారపడి ఉంటుందన్నారు. బాధలో తాను ఏదైనా మాట్లాడి ఉంటే అధిష్టానాన్ని క్షమాపణలు కోరుతున్నట్లు బోడే తెలిపారు.తన కంటే బెటర్ అభ్యర్ధి దొరుకుతారని పార్టీ సర్వే చేస్తున్నారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఖచ్చితంగా టికెట్ తనకే ప్రకటిస్తారని నమ్మకం ఉందన్నారు. అన్నం తినేవాడు ఎవరైనా వైసీపీలో చేరతారా అని గతంలో వంశీ అన్నాడని గుర్తుచేశారు.
తాను, బోండా ఉమా కూడా వంశీ తో మాట్లాడటం లేదన్నారు. తాము కలవటం ఎవరైనా చూస్తే దమ్ముంటే చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications