జగన్ ఉంటే సరిపోదు నాయనా, జనం కూడా ఉండాలని తెలుసుకోండి, అదే జీవిత సత్యం !
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో అధికార వైసీపీకి చుక్కలు కనపడుతున్నాయి. జగనన్న సింహం, సింహం సింగిల్ గా వస్తుంది, పందులే గుంపులు గుంపులుగా వస్తాయని ఇంతకాలం సినిమా డైలాగులు చెప్పిన వైసీపీ నాయకులు నోటికి తాళాలు వేసుకుని ఇంటి ముఖం పడుతున్నారు. వార్ వన్ సైడ్ కావడంతో నోరు తెరవడానికి కూడా వైసీపీ నాయకులు వెనుకా ముందు ఆలోచిస్తున్నారు.
జగన్ ఒకవైపు, జనం ఒకవైపు అన్నట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బయటకు వస్తున్నాయి. ఐదు సంవత్సరాలు తిరుగులేని నాయకులుగా చలామణి అయిన వైసీపీ నాయకులకు ఇప్పుడు పలకరించే కార్యకర్తలు కూడా కనపడకుండా తిరిగే పరిస్థితి వచ్చింది. జగన్ ను నమ్ముకుని ఇంతకాలం అరాచకాలు చేసిన కొందరు వైసీపీ నాయకులు ఇప్పుడు జనంలోకి వెళితే తంతారు అనై ఫీలింగ్ వచ్చేసింది.

ఐదు సంవత్సరాలు చెప్పిందే వేదం, వారిదే రాజ్యం, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, గంజాయి విక్రయాలు ఇలా వైసీపీలోని కొందరు నాయకులు చేసిన అరాచకాల గురించి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ప్రజల ముందు చెప్పారు. మేము చెప్పింది చెప్పాము, తీర్పు మీదే అంటూ కూటమి అభ్యర్థులు బాల్ ప్రజల కోర్టులోకి విసిరేశారు. ప్రజలు అన్నీ ఆలోచించి మే 13వ తేదీన ఓటు అనే ఆయుధంతో తీర్పు చెప్పారు.
టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీ నాయకులు ఎలాంటి వాళ్లు, ఎవరికి ఓటు వెయ్యాలి అని ఆలోచించే శక్తి ప్రజలకు ఉంది. ప్రజలు పిచ్చోళ్లు కాదు, నాయకులు చెప్పినట్లు వినే రోజులు పోయాయి అని మరోసారి నిరూపించారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం మేము ప్రజలు, పేదలకు, ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మహిళలకు చాలా చేశాము, జగన్ మా వెంట ఉన్నాడు అనే ఒకే ఒక్క ధైర్యంతో కూటమి ఆరోపణలను తిప్పికొట్టకుండా టీడీపీ, జనసేన నాయకుల మీద ఎదురుదాడికి దిగారు.

అయితే వైసీపీ నాయకులు ఇచ్చిన డబ్బులు తీసుకున్న ఓటర్లు సైలెంట్ గా కూటమికి ఓట్లు గుద్దేయడంతో వైసీపీ నాయకుల బిత్తరపోయారు. జగన్ ఉంటే సరిపోదని, జనం కూడా ఉండాలని ఇప్పుడు వైసీపీ నాయకులక తెలిసి వచ్చింది. ఇకనైనా చిన్నాపెద్దా,ఆడ, మగ అని తేడాలు చూసి నోరు తెరిచి మాట్లాడితే వైసీపీ నాయకులు బతికిపోతారని, లేదంటే నడిరోడ్డు మీదకు లాగి చితకబాదుతామని కూటమి కార్యకర్తలు వైసీపీ నాయకులను హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications