పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు; జనసైనికులకు సలహా!!
జనసేన, టీడీపీ పొత్తుపై పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపిన విషయం తెలిసిందే. సీఎం పదవి కోసం వెంపర్లాడేది లేదని వైసీపీని ఓడించడమే లక్ష్యంగా కలిసొచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుని తీరుతామని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ పొత్తులపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు పల్లకీ మోయటమే పవన్ కళ్యాణ్ అజెండా అని పేర్కొన్నారు. చంద్రబాబును సీఎం చెయ్యాలని పవన్ పనిచేస్తున్నాడని అన్నారు. ఇక తాజాగా పేర్ని నాని సైతం చంద్రబాబు అవసరాలకు పెట్టిన టెంట్ హౌస్ పార్టీనే జనసేన పార్టీ అని, పవన్ రాజకీయాలు కూడా చంద్రబాబు కోసమే చేస్తున్నారని సెటైర్లు వేశారు.

పొత్తులపై జనసేన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేసిన పేర్ని నాని బలం లేదన్న విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ ప్రశ్నించారు. పార్టీ పెట్టిన సమయంలోనే బలం లేదని పవన్ కు తెలుసునని, అప్పుడు బలంలేదు కాబట్టే పోటీ చేయలేదని పేర్కొన్నారు. ఇక 2019లో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వెనుక కారణం ఉందని పేర్కొన్న మాజీమంత్రి పేర్ని నాని, 2019లో చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.
అందుకే ఆ ఓట్లు జగన్ కు పడకుండా చేయడం కోసం జనసేన పోటీ చేసిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పుడు పోటీ చెయ్యటం కూడా చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చటం కోసమే అన్నారు. ఇక ఇదే సమయంలో ఓట్ల కోసం రాజకీయాలు చేయటం పవన్ కళ్యాణ్ కే చెల్లిందని ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ పై జనసేన కార్యకర్తలు, నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ ఆయన వారి ఆశలను చంద్రబాబు వద్ద తాకట్టు పెడుతున్నారని అన్నారు. పవన్ ని నమ్ముకుని తిరుగుతున్న జనసైనికులు తమ త్యాగాలను మానుకుని తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని మాజీ మంత్రి పేర్ని నాని వారికి సూచించారు.












Click it and Unblock the Notifications