టీడీపీ, బీజేపీ కలిసే..: లేదని తేల్చేసిన కిషన్ (పిక్చర్స్)
హైదరాబాద్: మెదక్ లోకసభ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామని బీజేపీ, టీడీపీ నేతలు ఉమ్మడిగా ఆదివారం ప్రకటన చేశారు. మెదక్ లోకసభ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి నిలుస్తారని బీజేపీ చెప్పగా, కమలం పార్టీ గెలుపుకు సహకరిస్తామని టీడీపీ నేతలు చెప్పారు.
మెదక్ పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని ఈ నెల 26న ఖరారు చేయనున్నట్టు బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. తాను మెదక్ బరిలో నిలుచోనని కిషన్ రెడ్డి తేల్చేశారు. మెదక్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి విజయానికి కృషి చేస్తామని తెలంగాణ టిడిపి నాయకులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్ రమణ తెలిపారు.
ఉప ఎన్నికపై చర్చించేందుకు దయాకర్ రావు నివాసంలో ఆదివారం బిజెపి, టిడిపి నాయకుల సమావేశం జరిగింది. బిజెపి తరఫున పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, శాసన సభాపక్షం నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ హాజరయ్యారు. టిడిపి తరఫున ఎమ్మెల్యే దయాకర్ రావు, పార్టీ నేత రమణ హాజరయ్యారు.

టీడీపీ, బీజేపీ
గత ఎన్నికల్లో ఈ నియోజక వర్గం నుంచి బిజెపి పోటీ చేసినందున ఆ పార్టీకే అవకాశం ఇవ్వాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించడంతో ఈ అంశంపై చర్చించేందుకు టిడిపి నాయకులు బిజెపి నాయకులను విందుకు ఆహ్వానించారు.

టీడీపీ, బీజేపీ
అంతకు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డిని ఈ ఆహ్వానం గురించి ప్రశ్నించగా, విందుకు ఆహ్వానించారు.. వెళ్లాలా? లేదా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. ఈ ఎన్నికల్లో బిజెపి పోటీ చేస్తుందని తెలిపారు.

బీజేపీ
కాంగ్రెస్ పార్టీ సునీతా లక్ష్మారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో తెరాస అభ్యర్థి తేలిన తరువాత బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయనుంది. మెదక్ సీటు గెలిచి నరేంద్ర మోడీకి బహుమతిగా ఇస్తామని బిజెపి నాయకులు చెబుతున్నారు. అయితే మెజారిటీ విషయంలో తేడా ఉండవచ్చు కానీ తెరాస తన సీటు తాను కైవసం చేసుకుంటుందని కొందరు బిజెపి నాయకులు చెబుతున్నారు.

బీజేపీ
తెరాస ఏ సామాజిక వర్గం అభ్యర్థిని పోటీకి నిలుపుతుందో చూసిన తరువాత దానికి తగ్గట్టు మా అభ్యర్థి ఎంపిక ఉంటుందంటున్నారు. టీడీపీ మద్దతిస్తామని చెప్పినప్పటికీ.. ఆ పార్టీ మద్దతుపై బిజెపి నాయకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదట. టిడిపికి తెలంగాణ వ్యతిరేక పార్టీ అనే ముద్ర బలంగా పడినందున ఆ పార్టీతో కలిసి చేసే ప్రచారం వల్ల లాభనష్టాలు ఏ విధంగా ఉంటాయనే ఆలోచనలో బిజెపి నాయకులు ఉన్నారు.












Click it and Unblock the Notifications