మేమిచ్చిన ప్యాకేజీ ఎలా ఉంది: ఏపీపై మోడీ, 'ప్రశ్నించే' వారిపై ఆగ్రహం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోదాకు సమానమైన నిధులు ఇస్తామని కేంద్రం చెప్పింది. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్, ఇతర నేతలు ప్రధాని నరేంద్ర మోడీని మంగళవారం నాడు ప్రధాని మోడీని ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రజలు ఇంకేం కోరుకుంటున్నారని వారిని అడిగారని తెలుస్తోంది.
ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై స్పందనను ప్రధాని మోడీ ఆరా తీశారు. ప్యాకేజీ ఎలా ఉందని, ఏపీ ప్రజలు సంతోషంగా ఉన్నారా అని, ఇంకా వారు కోరుకుంటున్నారని, ఏం చేస్తే బాగుంటుందని, ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారు.
మంగళవారం మధ్యాహ్నం ప్రధాని మోడీతో గవర్నర్ నరసింహన్ ముప్పావు గంట పాటు భేటీ అయ్యారు. దాదాపు ఇరవై నిమిషాలకు పైగా ఏపీ ప్యాకేజీ పైనే ప్రధాని, గవర్నర్ మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. విపక్షాల ఆందోళనలు చర్చకు వచ్చాయి.

హోదా ఇవ్వడానికి ఉన్న అడ్డంకులను అన్ని పార్టీలకు వివరించి అనంతరం ప్యాకేజీపై ప్రకటన చేసి ఉంటే బాగుండేదని గవర్నర్ సూచించారని తెలుస్తోంది. ప్యాకేజీపై అఖిలపక్ష సమావేశాలను ఏర్పాటు చేస్తే సమస్య మరింత జఠిలమవుతుందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డట్లుగా తెలుస్తోంది.
అభివృద్ధి కావాలనుకున్న వాళ్లు ప్యాకేజీని స్వాగతిస్తారని, సమస్యలను సాగదీసి రావణకాష్టం చేయాలనుకున్న వారు మాత్రమే విమర్శలు చేస్తారని ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.
ప్యాకేజీని ప్రకటించడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చిందని, ఇతర రాష్ట్రాల నుంచి ఎటువంటి సమస్యలూ ఎదురుకావనే భావిస్తున్నామని, ప్యాకేజీ వల్ల అభివృద్ధి పథంలో ఏపీ దూసుకుపోవడం ఖాయమని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు.
ప్యాకేజీ పట్ల సుమారు 60శాతం ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని, ప్రతిపక్షాలు మాత్రం హోదా వల్ల అమిత ప్రయోజనాలు కలుగుతాయని దుష్ప్రచారం చేస్తున్నాయని, ఈ ప్యాకేజీతో ఏపీకి మరింత మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా భావిస్తున్నారని గవర్నర్ చెప్పారని తెలుస్తోంది.
మరోవైపు, ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని, కేంద్రం ఇస్తామంటున్న నిధులను కూడా త్వరితగతిన ఇవ్వాలని చంద్రబాబు చేసిన డిమాండ్లను కూడా ప్రధాని దృష్టికి గవర్నర్ నరసింహన్ తీసుకు వెళ్లారు. త్వరలో ప్యాకేజీపై చర్చించి, ఆమోదముద్ర వేస్తామని మోడీ చెప్పారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications