పవన్ కు ప్రధాని మోదీ ఫోన్ కాల్- ఆ నమ్మకం ఉంది
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు శస్త్రచికిత్స సైతం జరిగింది. కొంతకాలంగా శ్వాస సంబంధిత ఇబ్బందులతో సతమతమౌతున్నారు. ఇది మరింత తీవ్రం కావడంతో ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు ఆయనకు సర్జరీ చేశారు. ఇటీవలే వెలగపూడి సచివాలయంలో ఓ రివ్యూ మీటింగ్ లో పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆ వెంటనే అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్ కు అడ్మిట్ అయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్లు ఆయనకు స్కానింగ్ చేశారు. సర్జరీ అవసరమని నిర్ణయించారు. దీంతో శనివారం సాయంత్రం ఆపరేషన్ చేశారు. ఇది విజయవంతంగా ముగిసింది. సైనసైటిస్ ఉండటం వల్ల ముక్కుకు సర్జరీ చేశారని చెబుతున్నారు. ఇది అధికారికంగా తెలియరావాల్సి ఉంది. శస్త్రచికిత్స తర్వాత పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని సూచించారు.

పవన్ కల్యాణ్ సర్జరీకి సంబంధించిన తాజా సమాచారాన్ని ఆయన భార్య అన్నా లెజినోవా సోషల్ మీడియాలో పంచుకున్నారు. పవన్ కోలుకుంటున్నారని తెలిపారు. సర్జరీ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు పలువురు ప్రముఖులు ట్వీట్లు చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పీడీ రికవరీని కోరుతూ ట్వీట్లు పోస్ట్ చేశారు. ఆయన మేనల్లుడు, ప్రముఖ నటుడు సాయిధరమ్ తేజ కూడా త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. పవన్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలోనే కోలుకుంటారని నమ్ముతూ ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను.@PawanKalyan
— Narendra Modi (@narendramodi) April 19, 2026
అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పవన్ కల్యాణ్ ఆపరేషన్ పై స్పందించారు. నేరుగా పవన్ కు ఫోన్ చేశారు. ఆరోగ్యం గురించి ఆరా తీశారు.ఈ సమాచారాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ తో ఫోన్ లో మాట్లాడానని, ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నానని అన్నారు. ఆయన అపార ధైర్యశాలి, త్వరలోనే కోలుకుంటారని తనకు నమ్మకం ఉందని చెప్పారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications