మహేష్ బ్యాంక్ దోపిడీ: ఇంటి దొంగ పనే, ఫ్యామిలీ అరెస్ట్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఏఎస్ రావు నగర్‌లోని మహేష్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు దోపిడీ గుట్టు రట్టయింది. చోరీకి సంబంధించి బ్యాంకు ఉద్యోగిని, కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం వారిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
ఈ సందర్భంగా సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ విలేకరులతో మాట్లాడారు. గత నెల 29న బ్యాంకులో ఉన్న సుమారు 15 కిలోల బంగారు ఆభరణాలను లాకర్ల నుంచి దొంగిలించారని తెలిపారు. డిసిపి నవదీక్షిత్ ఆధ్వర్యంలో ఎస్ఓటి, సిసిఎస్ పోలీసులు నిందితులైన బ్యాంకు ఉద్యోగి బ్రహ్మచారి, వేద విరాట్, లలితలను అరెస్టు చేశారన్నారు.
అరెస్టయిన వారి నుండి రూ.4.50 కోట్ల విలువైన 15 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. బ్యాంకులోకి వెళ్లేందుకు మొత్తం పది తాళాలు ఉండగా, స్ట్రాంగ్ రూం తెరవడానికి రెండు మాస్టర్ తాళం చెవులున్నాయని, దోపిడీకి పాల్పడిన వారు బ్యాంకులోని సిసి కెమెరాను ఆపివేశారన్నారు.

బ్యాంకు మేనేజర్ సహా 8 మంది సిబ్బంది, సెక్యూరిటీ గార్డు వద్ద వివరాలు సేకరించినట్లు చెప్పారు. సిసి టివిలో కీలక దృశ్యాలు లభ్యమయ్యాయని, బ్యాంకు సిబ్బంది డ్రాలో తాళాలు తీసినట్లు సిసి టివిలో గుర్తించామన్నారు. నిందితుడు బ్రహ్మచారి బ్యాంకులో అప్రైజర్‌గా పని చేస్తున్నారన్నారు.
బంగారాన్ని చోరీ చేసిన అనంతరం బ్రహ్మచారి దానిని తన కుటుంబ సభ్యులకు అప్పగించారని, నిందితుడు కొంత బంగారాన్ని కరిగించినట్లు సివి ఆనంద్ తెలిపారు. త్వరలో మొత్తం బంగారం రికవరీ చేస్తామన్నారు. కేసు విచారణలో సిసి కెమెరా ఫుటేజీలు ఉపయోగపడ్డాయన్నారు.
ఒరిజినల్ తాళం చేతులు లేకుండా మారు తాళాలు తయారు చేయడం సాధ్యం కాదని ఆ తాళాలు తయారు చేసిన కంపెనీ వారు తెలిపారన్నారు. బ్యాంకు పని చేసే సమయంలో ఒరిజినల్ తాళాలను సీనియర్ అకౌంటెంట్ పక్కనున్న సొరుగులో నుంచి ఓ వ్యక్తి తాళాలు తీసినట్లుగా గుర్తించామని, ఆ వ్యక్తి తాళాల సెట్ తీసుకొని బాత్ రూంకు వెళ్లినట్లు సిసి టివిలో కనిపించిందని, విచారించి బ్రహ్మచారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆరు నెలల క్రితమే పక్కా ప్రణాళిక రూపొందించారన్నారు.












Click it and Unblock the Notifications