వైసీపీ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలపై కేసులు-పోలింగ్ ముగియగానే మారిన సీన్..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కానీ పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు, హింస ఈసీ పనితీరుపై విమర్శలకు తావిచ్చాయి. దీంతో ఈసీ కొరడా ఝళిపించడం మొదలుపెట్టింది. నిన్న మధ్యాహ్నం మాచర్లతో పాటు తెనాలి, తాడిపత్రిలో ఘటనలపై స్పందించి హింసకు కారణమైన నేతలను హౌస్ అరెస్టులు చేయాలని ఆదేశాలు ఇచ్చిన ఈసీ.. ఇవాళ పోలీసులతో మరికొందరిపై కేసులు నమోదు చేయిస్తోంది.
డోన్ లో మరోసారి పోటీ చేస్తున్న వైసీపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పై స్థానిక పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఆయనతో పాటు 30 మంది అనుచరులపైనా కేసులు నమోదయ్యాయి. డోన్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న పీఎన్ బాబు కారుపై దాడికి పాల్పడి కులం పేరుతో దూషించారని అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

అలాగే వైఎస్సార్ జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి పైనా పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిన్న పోలింగగ్ సందర్బంగా చాపాడు మండలంలో ఇద్దరు టీడీపీ ఏజెంట్లపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. ఈ దాడుల్లో గాయపడిన టీడీపీ ఏజెంట్లు ప్రస్తుతం ప్రాణాపాయస్ధితిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఈ ఘటనకు కారకుడిగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై కేసు నమోదైంది.
అటు తెనాలి పోలింగ్ కేంద్రంలో ఓటరుపై మూకుమ్మడి దాడి ఘటనలో సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తో పాటు ఆయన అనుచరులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న పోలింగ్ కేంద్రంలో క్యూ పాటించకుండా బూత్ లోకి వెళ్లి ఓటు వేసి వచ్చిన ఎమ్మెల్యే శివకుమార్ ను ప్రశ్నించారన్న కారణంతో గొట్టుముక్కల సుధాకర్ అనే వ్యక్తిని ఎమ్మెల్యే చెంపమీద కొట్టడం, ఆయన తిరిగి కొట్టడంతో ఎమ్మెల్యే అనుచరులు ఆయనపై మూకుమ్మడిగా పోలింగ్ కేంద్రంలోనే దాడి చేశారు. ఈ ఘటనపై ఈసీ సీరియస్ అయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications