వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కి షాక్..
వైసీపీ నేతలకు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే నందిగం సురేశ్, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళి పలు కేసుల్లో అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కి పోలీసులు షాక్ ఇచ్చారు. పోక్సో కేసులో బాధితురాలి పేరును ఒక ఇంటర్వ్యూలో చెప్పారంటూ ఆయనపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే విచారణకు హాజరు కావాలని.. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు.. అనంతపురంలో ఉన్న గోరంట్ల ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అత్యాచార ఘటనలోని బాధితురాల పేర్లను బహిరంగంగా తెలిపారని 2024 నవంబర్ లో మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గోరంట్ల మాధవ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 35/3 ప్రకారం గోరంట్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మార్చి 5న విచారణకు హాజరు కావాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాధవ్ పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

అయితే గోరంట్ల మాధవ్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు రావడంతో.. వైసీపీ శ్రేణులు ఆయన ఇంటికి భారీగా చేరుకోవడంతో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తనకు నోటీసులు ఇవ్వడంపై.. కూటమి ప్రభుత్వంపై గోరంట్ల మాధవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మీరు చేసేవి గుర్తు పెట్టుకోండి అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు సవాల్ విసిరారు. త్వరలోనే రాష్ట్రంలో అంతర్యుద్ధం తప్పదని హెచ్చరించారు.
ప్రభుత్వం కావాలనే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి.. వైసీపీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తోందని గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు. మార్చి 5వ తేదీన విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారని.. అయితే ఆరోజు తనకు వేరే షెడ్యూల్ ఉంటే.. మరోరోజు వస్తానని కోరతానని చెప్పారు. లేకపోతే అదే రోజు తన లాయర్‌తో కలిసి విచారణకు హాజరవుతానని గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు. గోరంట్ల మాధవ్‌పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ నోటీసులు ఇచ్చారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications