అమరావతి రైతులకు షాక్ - పాదయాత్రకు అనుమతి నిరాకరణ : న్యాయస్థానం టు దేవస్థానం..!!
కొద్ది రోజులుగా రాష్ట్రంలో చర్చకు కారణమైన అమరావతి రైతుల పాదయాత్రకు పోలీసు శాఖ అనుమతి నిరాకరించింది. రైతుల పాదయాత్రకు సంబంధించి అనుమతి విషయంలో స్పష్టత ఇవ్వాలని హైకోర్టు పోలీసు శాఖను ఆదేశించింది. దీంతో.. అమరావతి పరిరక్షణ సమితి తలపెట్టిన మహా పాదయాత్ర వల్ల ఘర్షణలు, విద్వేషాలు చెలరేగే అవకాశం ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. అవాంఛనీయ ఘటనలు, అల్లర్లు, ఇతర సమస్యలు తలెత్తకుండా చూసేందుకు దీనికి అనుమతి నిరాకరిస్తున్నట్లు వెల్లడించారు.

జేఏసీ నేతలకు డీజీపీ లేఖ
న్యాయస్థానం నుంచి దేవస్థానానికి' పేరుతో ఈ యాత్ర చేపట్టాలని అమరాతి జేఏసీ నిర్ణయించింది. తమ నిర్ణయాన్ని వివరిస్తూ అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు ఈ మేరకు ఆయన లేఖ రాశారు. పార్టీలపరంగా చీలిపోయిన గ్రామాల మీదుగా ఈ యాత్ర సాగినప్పుడు అక్కడి పరిణామాలు ఘర్షణలకు దారితీయొచ్చని..అప్పుడు శాంతిభద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది మూడు రాజధానుల అమలు కోరుకునే ప్రాంత ప్రజల్లో శతృత్వానికి కారణమవుతుందని వివరించారు.

అనుమతి ఇవ్వలేమంటూ స్పష్టీకరణ
47 రోజుల పాటు భారీ పరివారంతో సాగే ఈ యాత్రకు పోలీసు భద్రత కల్పించటం కష్టమని చెప్పుకొచ్చారు. వీటన్నింటి నేపథ్యంలో ప్రజాప్రయోజనాల దృష్ట్యా పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఆ లేఖలో స్పష్టం చేసారు. అమరావతి పరిరక్షణకు ఉద్యమించేందుకు శక్తినివ్వాలని, పోరాటం విజయవంతమయ్యేలా చూడాలని కోరుతూ వెంకటేశ్వర స్వామిని మొక్కుకునేందుకు ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు గద్దె తిరుపతిరావు దరఖాస్తులో పేర్కొన్నారని... ఆ అంశానికే వారు పరిమితమయ్యేలా కనిపించట్లేదని అభిప్రాయపడ్డారు.

ఇతర అంశాలు తెర మీదకు వస్తాయనే ఉద్దేశం
ఇతర అంశాలను తెరపైకి తీసుకురావాలనేది వారి ఉద్దేశంగా అనిపిస్తోంద పేర్కొన్నారు. ఇది విద్వేషాలకు కారణమవుతుంది. పాదయాత్ర సాగే ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుందనే భావన వ్యక్తం చేసారు. ఈ పాదయాత్రలో ఎంతమంది, ఎవరెవరు పాల్గొంటారనే దానిపై స్పష్టత లేదన్నారు. ఒకేచోట భారీసంఖ్యలో జనం గుమిగూడటం వల్ల నిర్వాహకులు కొవిడ్ ప్రోటోకాల్ పాటించటం కష్టమని... ఇది కొవిడ్ వ్యాప్తికి కారణమవుతుందని డీజీపీ అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటికే సన్నాహక సమావేశం జరిగిందని... ఎన్నికల ప్రకటన వస్తే ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుందన్నారు.

ఎన్నికల కోడ్ కు అవకాశం
అప్పుడు భారీ ర్యాలీల నిర్వహణకు అవకాశం ఉండదని చెప్పుకొచ్చారు. మూడు రాజధానులపై దాఖలైన రిట్ పిటిషన్ల విచారణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. పాదయాత్రలో పాల్గొనేవారి సంఖ్యపై దరఖాస్తుదారుకు నియంత్రణ లేదన్నారు. జాతీయ రహదారులు, రాష్ట్ర ప్రధాన రహదారులు, ఇతర ప్రాంతాల మీదుగా సాగే ఈ పాదయాత్రకు పోలీసు భద్రత కల్పించటం కష్టమని డీజీపీ వివరించారు.
Recommended Video

కోర్టుకు జేఏసీ నేతలు
అదే విధంగా...అమరావతి పరిరక్షణ సమితి తిరుమల వరకూ పాదయాత్ర చేయాలని తలపెట్టిందని వివరిస్తూ... అయితే తిరుమలలో రాజకీయ కార్యక్రమాలకు అనుమతి ఉండదు. ధార్మిక కార్యక్రమాలనూ అక్కడ తితిదేయే పర్యవేక్షిస్తుందని లేఖలో పేర్కొన్నారు. దీంతో..పాదయాత్రకు అనుమతి కోర్టు ద్వారా సాధించే ప్రయత్నం చేస్తామని అమరావతి జేఏసీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications