వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ది ఒకే మాట..!?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఈసారి జరిగే ఎన్నికలు సాధారణంగా జరగవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదే పదే చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా తన పార్టీ శ్రేణులకు అదే చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయితే ఏ సభలో పాల్గొన్నా, ఏ సమావేశంలో ప్రసంగించినా ఈ విషయాన్నే ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.

శ్రేణులకు పిలుపునిచ్చిన పవన్ కల్యాణ్
తాజాగా తాను పర్యటించిన సత్తెనపల్లిలోను పవన్ కల్యాణ్ రానున్న ఎన్నికలపై వ్యాఖ్యలు చేశారు. ఈసారి హోరాహోరీ పోరు తప్పదని, వైసీపీ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొనే అవకాశం ఉందని, ఎటువంటి పరిస్థితులెదురైనా తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడిచేటప్పుడు విజయావకాశాలు ఎవరికి ఉంటాయి అనేది తేలడం కష్టంగా మారుతుంది. బరిలో నిలిచిన కోడిపుంజుల మాదిరిగా కొట్లాడుకునే పార్టీల మధ్య ఫలితం వెంటనే వెలువడే అవకాశం లేదు.

ఏపీలో రోజురోజుకు మారుతున్న పరిస్థితులు
అయితే ఒక్కటి మాత్రం వాస్తవం.. ఏపీ అసెంబ్లీకి జరిగే ఎన్నికలు వాడిగా వేడిగా జరుగుతాయనేది మాత్రం సుస్పష్టం. ఏపీలో రోజురోజుకు పరిస్థితి మారిపోతోంది. ఒక వర్గం ప్రజలు తమకు సంక్షేమం కావాలని కోరుకుంటుండగా, మరోవర్గం ప్రజలు తమకు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. ఏపీ రాజకీయాలకు కులం పునాది కావడంతో కులం ఓట్లు కూడా వెల్లువలా ప్రతి పార్టీ సంపాదించాల్సి ఉంటుంది. రానున్న ఎన్నికల్లో 175కు 175 గెలవాలని జగన్ లక్ష్యాన్ని నిర్ధేశించారు. రంగంలోకి దిగితే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కాకుండా ఉందని, ప్రతి నియోజకవర్గం గెలవాలంటే ఎలా అంటూ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.

గెలుపు తమదే అంటున్న మూడుపార్టీలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం ఈసారి ఎన్నికల్లో గెలుపు తమదేనని చెబుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో తాను ఇలాగే ధీమాగా ఉండి ప్రజల నాడిని అంచనా వేయలేక దెబ్బతిన్నానని, ఈసారి అటువంటి పరిస్థితి ఉండకూడదని కోరుకుంటున్నారు. అందుకే ఆయన అన్నిరకాలుగా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. జనసేనాని అయితే వచ్చే ఎన్నికలను యుద్ధంతో అభివర్ణించారు. వైసీపీ వైఖరిని గమనిస్తుంటే రానున్న ఎన్నికల్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని పవన్ పార్టీ శ్రేణులను హెచ్చరిస్తున్నారు.

ఏం జరిగినా సిద్ధపడండి అంటున్న పవన్
ఏం జరిగినా అన్నింటికీ సిద్ధపడే కార్యకర్తలంతా ముందుకు రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిస్తున్నారు. తనకు పదవుల మీద ఆశ లేదని, వ్యతిరేకఓటును చీలనివ్వనని మరోసారి చెబుతున్నారు. అధికారం కోల్పోకూడదని, ఒకరు అధికారాన్ని తిరిగి దక్కించుకోవాలని మరొకరు ప్రయత్నిస్తుండగా, ప్రజలు తలుచుకుంటే తాను ముఖ్యమంత్రినవుతానని పవన్ చెబుతున్నారు. పార్టీల అధినేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంకానీ, ప్రజాభిప్రాయాన్ని కానీ పరిశీలిస్తుంటే జరగబోయే ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పదని, అయితే ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా ఓటమి అతి స్వల్పంగా ఉండబోతోందని అర్థమవుతోంది. ఏదన్నాకానీ రానున్న ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు భీకరంగా పోరాడుకోవడానికి పందెం కోళ్లలా సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications