సంక్రాంతికి ఏపీలో ఎన్ని వేల కోట్ల పందాలు జరుగుతున్నాయో తెలిస్తే..!
సంక్రాంతి పండుగకు ఏపీలో కో అంటే కోట్లు.. కోట్ల వ్యాపారం జరుగనుంది. పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో వేల కోట్ల రూపాయలు చేతులు మారనున్నాయి. సంక్రాంతి పండుగ సందడి చూడాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాలకు వెళ్లాల్సిందే. మూడు రోజుల పండుగకు మోడుబారిన పల్లెలు కళకళలాడుతాయి. ప్రతి ఊరు సంబురంతో నిండుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర ప్రాంతం కోలాహలంగా ఉంటుంది.
పండుగకు రెండు వారాల ముందు నుంచే సందడి నెలకొనగా ఇక పండుగ మూడు రోజులు అంబరాన్నంటేలా ఒక జాతర మాదిరి ప్రతి ఊరు ఉంటుంది. వలస వెళ్లిన ప్రతి మనిషి ఈ పండుగకు సొంతూరు వస్తుంటారు. ఈ పండుగ సమయంలో ప్రత్యేక ఆకర్షణ కోళ్ల పందాలు. సంక్రాంతి అంటేనే కోళ్ల పందాలు అనే మాదిరిగా మారిపోయింది. చిన్నాపెద్దా ఎవరైనా ఈ కోడిపందాలు తెగ ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ పందాలతో పాటు కాయ్ రాజా కాయ్, పేకాట తదితర ఆటలు ప్రత్యక్షమవుతాయి. ఇక మద్యం అయితే ఏరులై పారుతుంది. మాంసం అయితే టన్నులు టన్నులు అమ్ముడవుతుంది.

ఇక మహిళలు రంగవల్లులు, పిండివంటలు, ఆటాపాటలతో సందడి చేస్తుంటారు. ఇలా ఎటు చూసినా సంక్రాంతి పండుగతో ఆంధ్రప్రదేశ్ కు ప్రాణం తీసుకువస్తుంది. ఈ పండుగతో ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి అందుతుంది. గతేడాది వైసీపీ ప్రభుత్వం పండుగపై ఆంక్షలు విధించగా.. చంద్రబాబు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ నివ్వడంతో ఈసారి పండుగ సరికొత్త ఉత్సాహంతో జరుగనుంది. ఈ పండుగకు అన్నీ కలిపి రూ.3 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని చెప్పవచ్చు. ఈ ఆదాయంలో ప్రధాన భాగం కోడిపందాలతో పాటు మద్యం విక్రయాలు సింహభాగం ఉంటాయి.
కోళ్లపందాల్లో కోట్లు కోట్లు ఏపీలోని రాయలసీమ మినహా మిగతా కోస్తాంధ్ర ప్రాంతంలో సంక్రాంతి పండుగ ఆనందోత్సాహాల మధ్య జరుగుతుంది.
ఉత్తరాంధ్రలో సంక్రాంతి సందడి నామమాత్రంగా ఉంటుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అసలైన సంక్రాంతి పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇక పండుగ సందడి చూసేందుకు తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల కొందరు ఆసక్తితో వస్తుంటారు. ఇక్కడ జరిగే కోడిపందాల్లో కోట్లు కోట్ల వ్యాపారం జరుగుతుంది. చిన్న బరుల్లో లక్షల్లో లావాదేవీలు జరిగితే పెద్ద బరుల్లో కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయి. ఈ కోళ్ల పందాలు కొన్ని గ్రామాల మధ్య.. కొన్ని కుటుంబాల మధ్య ప్రతిష్టాత్మకంగా జరుగుతుంటాయి. పందాల్లో గెలిచేందుకు.. పరువు నిలబెట్టుకునేందుకు కోట్లు కుమ్మరించేందుకు కొందరు వెనుకాడరు. దీంతో ఏపీలో జరిగే కోళ్ల పందాల విలువ రమారమి రూ.వెయ్యి కోళ్లు చెప్పుకోవచ్చు. ఒక్క గోదావరి జిల్లాలోనే రూ.500 కోట్లపైన లావాదేవీలు జరుగుతాయి.












Click it and Unblock the Notifications