వైసీపీలో చేరిన పోతిన మహేష్ - జగన్ కీలక హామీ..!!
ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీల్లో చేరికలు పెరుగుతున్నాయి. మూడు పార్టీల కూటమిలో భాగంగా సీట్ల దక్కని నేతలు ఎన్నికల సమయంలో వైసీపీ వైపు చూస్తున్నారు. అందులో భాగంగా విజయవాడ పశ్చిమం నుంచి సీటు ఆశించి భంగపడిన జనసేన నేత పోతిన మహేష్ తాజాగా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. విజయవాడ నుంచి ర్యాలీగా పల్నాడులో జగన్ బస చేసిన సైట్ వద్దకు వచ్చిన పోతిన వైసీపీ కండువా కప్పుకున్నారు.
విజయవాడ పశ్చిమం నుంచి జనసేన నేత పోతిన మహేష్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉండటంతో తనకు సీటు ఖాయమని నమ్మకం పెట్టుకున్నారు. అయితే, పొత్తులో భాగంగా పశ్చిమం సీటు బీజేపీకి దక్కింది. ఈ సీటు నుంచి బీజేపీ అభ్యర్దిగా మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. దీంతో పోతినతో వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లారు. విజయవాడ పశ్చిమం లో నగరాల సామాజిక వర్గానికి చెందిన ఓటర్లతో పాటుగా ముస్తిం మైనార్టీ ఓటర్లు ఎక్కువ. పశ్చిమం నుంచి వైసీపీ ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తికి సీటు కేటాయించింది.

జనసేనకు రాజీనామా చేసిన సమయంలో పోతిన మహేష్ జనసేనాని పవన్ కల్యాణ్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. పోతిన మహేష్ చేసిన విమర్శలపైన జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే, తాను మాట మీద నిలబడే నాయకుడి పార్టీలోకి వెళ్తానని పోతిన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. కమ్మ వర్గానికి చెందిన నేతలకు సీట్లు ఇచ్చేందుకు ఇతర వర్గాలను విస్మరిస్తారా అంటూ పోతిన ప్రశ్నించారు. విజయవాడ నుంచి కేశినేని నాని వైసీపీలో చేరిన తరువాత సమీకరణాలు మారుతున్నాయి.
ఇప్పుడు వైసీపీ నుంచి విజయవాడ ఎంపీ అభ్యర్దిగా కేశినేని నాని..టీడీపీ అభ్యర్దిగా కేశినేని చిన్ని పోటీ చేస్తున్నారు. ఇక, విజయవాడ పార్లమెంట్ పరధిలో మరి కొందరు నేతలను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు నాని మంత్రాంగా చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ తూర్పు జనసేన ఇంఛార్జ్ రాము వైసీపీలో చేరగా, ఇప్పుడు పోతిన చేరికతో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. పోతినకు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చే ప్రాధాన్యత గురించి జగన్ ఇప్పటికే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications