చంద్రబాబుపై కేసులు నమోదు: కీలకంగా సీసీటీవీ ఫుటేజీలు: 500 మందికి పైగా పోలీసులు
అమరావతి: ప్రకాశంజిల్లా యర్రగొండపాలెంలో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో- పోలీసులు కీలక ముందడుగు వేశారు. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కేసులు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మొత్తం మూడు కేసులు ఆయనపై పెట్టారు. కొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తలపైనా కేసులు రిజిస్టర్ అయ్యాయి.
వాటి వివరాలను యర్రగొండపాలెం డీఎస్పీ కిశోర్ కుమార్ మీడియాకు వివరించారు. కేసులు నమోదు చేసే విషయంలో సీసీటీవీ ఫుటేజీ కీలకంగా మారిందని అన్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన తరువాతే దీనికి కారకులపై కేసులు పెట్టామని పేర్కొన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ కార్యాలయం వద్దకు చంద్రబాబు సమీపించిన వెంటనే కొందరు టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారని చెప్పారు.

మంత్రి కార్యాలయం వద్ద నిల్చున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై వారు రాళ్లు రువ్వినట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తించామని, వారిలో ఒక బాలుడు సహా నలుగురు ఉన్నారని డీఎస్పీ చెప్పారు. ఆ తరువాతే వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్వారని, ఈ ఘటనలో రెండు పార్టీలవారికి గాయాలయ్యాయని అన్నారు. చంద్రబాబు నాయుడి కాన్వాయ్ యర్రగొండపాలెంలోకి ప్రవేశించిన తరువాత ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశామని వివరించారు.
అనుమతి ఇచ్చిన చోటే సభను నిర్వహించుకోవాలని తాము చంద్రబాబుకు పదే పదే విజ్ఞప్తి చేశామని డీఎస్పీ కిశోర్ కుమార్ అన్నారు. తాము అనుమతి ఇచ్చిన చోట కాకుండా ప్రజలకు ఇబ్బంది కలిగే ప్రదేశంలో సభను నిర్వహించినందు వల్ల కేసు నమోదు చేశామని చెప్పారు. మొత్తంగా చంద్రబాబుపై మూడు కేసులు పెట్టామని, వాటిపై దర్యాప్తు చేపట్టామని తెలిపారు.

సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా రాళ్లు రువ్వుకున్న వారిని గుర్తించామని, వాటి ఆధారంగానే ఈ కేసులు పెట్టామని డీఎస్పీ స్పష్టం చేశారు. వారిని అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో తమ వైఫల్యం ఉందంటూ టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చంద్రబాబు సభకు 500 మందికి పైగా పోలీసులను మోహరించామని చెప్పారు.












Click it and Unblock the Notifications