ప్రకాశం జిల్లా ప్రజలకు బిగ్ అలర్ట్-ఎస్పీ కీలక సూచనలు..!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అంతకంతకూ తీవ్రమవుతోంది. దీని ప్రభావంతో రాయలసీమ జిల్లాలతో పాటు దక్షిణాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు. వాతావరణ విభాగం సూచనల ప్రకారం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు.
ప్రకాశం జిల్లాలో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు తక్షణ స్పందన ఇవ్వడానికి జిల్లా పోలీసు శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు, పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. అవి 24x7 అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నదులు, వాగులు, వంకలు, చెరువుల వద్ద ప్రమాద సూచన ప్రాంతాల్లో పికెట్స్ఏర్పాటు చేయాలని, రాత్రి పూట కూడా నిరంతర గస్తీ నిర్వహించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.

వరదల తీవ్రత, నష్టం, రహదారుల్లో ఏర్పడిన చీలికలు, ప్రజలు చిక్కుకుపోయిన ప్రాంతాలు, సహాయక చర్యల స్థితిని అంచనా వేయడానికి అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్ సేవలను సిద్ధంగా ఉంచాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైనచోట సహాయక శిబిరాలు, పునరావాస కేంద్రాలు గుర్తించి ప్రజల భద్రత కోసం చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు.
లోతట్టు ప్రాంతాల్లో సమన్వయంతో కూడిన సహాయం, తరలింపు చర్యలు చేపట్టేందుకు రెవెన్యూ, మత్స్య, రోడ్లు-భవనాలు, పంచాయతీ రాజ్, నీటిపారుదల, విద్యుత్ , ఇతర విభాగాల అధికారులతో సమన్వయం కొనసాగించాలన్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే సమయంలో ప్రజలు చెట్ల కింద ఉండరాదని కోరారు. అ సమయంలో పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. అలాగే సముద్ర తీరం వెంబడి నివసిస్తున్న ప్రజలు రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు ఇచ్చే సూచనలను పాటించి, అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు లేదా తుఫాన్ షెల్టర్ కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.

ఈదురు గాలులు, వర్షాల కారణంగా రహదారులపై చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిన సందర్భాల్లో వెంటనే సమాచారం అందించి, వాటిని తొలగించే చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని ఎస్పీ ఆదేశించారు. ఉధృతంగా ప్రవహించే నదులు, వాగులు, వంకల ప్రాంతాల్లో ఈత కొట్టడం, చేపలు పట్టడం చేయరాదన్నారు. మత్స్యకారులు కూడా సముద్రంలోకి వెళ్లొద్దన్నారు. అత్యవసర పరిస్థితుల్లో శిథిలాలను తొలగించడానికి ప్రొక్లెయిన్లు, జేసీబీలను సిద్ధంగా ఉంచాలన్నారు. రెయిన్ కోట్లు, తాళ్లు, అత్యవసర లైట్లు, పవర్ రంపపు కట్టర్లు, బ్యాకప్ విద్యుత్ వనరులు వంటి ముఖ్యమైన పరికరాలను, వరద సహాయ చర్యల కోసం మత్స్యకారులు, ఈతగాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కొరకు డయల్ 112కి, పోలీస్ వాట్సాప్ నెంబర్ 9121102266 లేదా సంబంధిత స్ధానిక పోలీసు అధికారులకు సమాచారమివ్వాలని జిల్లా ఎస్పీ కోరారు.












Click it and Unblock the Notifications