ప్రశాంత్ కిశోర్ స్కానింగ్: జగన్ పార్టీకి వీరు, ఆ సీట్లలో ఓకె
ప్రశాంత్ కిశోర్ జిల్లాలవారీగా చేస్తున్న స్కానింగ్‌లో తూర్పు గోదావరి జిల్లా పరిస్థితిపై సర్వే చేసినట్లు తెలుస్తోంది.
కాకినాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సలహాదారు ప్రశాంత్ కిశోర్ జిల్లాలవారీగా చేస్తున్న స్కానింగ్‌లో తూర్పు గోదావరి జిల్లా పరిస్థితిపై సర్వే చేసినట్లు తెలుస్తోంది. ఏయే నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలంగా ఉంది, ఏయే నియోజకవర్గాల్లో సమస్యలున్నాయి, ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి వైసిపిలోకి వచ్చేవారున్నారు అనే విషయాలపై ఆయన స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ కిషోర్ సూచనలతో కోఆర్డినేటర్ల పదవుల్లో కూడా వైయస్ జగన్ మార్పులు చేర్పులు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వైసీపీ జిల్లా కోఆర్డినేటర్లు, పార్టీ ముఖ్యనేతలతో ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముందే తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ స్థితిగతులు, నేతల వ్యవహారశైలిపై ప్రశాంత్ కిశోర్ బృందం సర్వే నిర్వహించినట్టు తెలుస్తోంది.
Recommended Video

ఈ సర్వేలో వెల్లడైన అంశాలపై పీకే సమీక్షించి జిల్లాలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై నివేదిక రూపొందించినట్లు సమాచారం. పార్టీలో ఉన్న లోటుపాట్లపై, బలహీనతలపై నివేదిక రూపొందించినట్టు తెలుస్తోంది.

నాలుగు ఫరవా లేదు...
గత శాసనసభ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు విజయం సాధించిన తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, రంపచోడవరం, కొత్తపేట నియోజకవర్గాలలో నాలుగు చోట్ల పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉందని ప్రశాంత్ కిశోర్ తన నివేదికలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలో గతంలో స్వల్పతేడాతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.ప్రస్తుత కో ఆర్డినేటర్ వ్యక్తిగత ఇమేజ్ వల్ల పార్టీ బాగా బలోపేతంగా ఉందని అంటున్నారు.

ఇద్దరు ఇంచార్జీలతో ముప్పు
కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి జగన్ అదనంగా మరో సమన్వయ కర్తను నియమించారు. దాంతో అంతర్గత విభేదాలు పెరిగే ప్రమాదం ఉందని పికె హెచ్చరించినట్లు సమాచారం. ఇక్కడ పరిస్థితి సరిదిద్దాల్సిఉందని ఆయన సూచించారని తెలుస్తోంది. రాజమహేంద్రవరం అర్బన్, పెద్దాపురం, మండపేట, రామచంద్రపురంతో పాటు కోనసీమలోని మూడు అసెంబ్లీ స్థానాలలో పార్టీ బలపడాల్సి ఉందని ఆయన చెప్పారని అంటున్నారు.

ద్వారంపూడితో ఇలా...
కాకినాడ అర్బన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కో ఆర్డినేటర్‌గా ఇప్పటివరకు ముత్తా శశిధర్ వ్యవహరించారు. ఇటీవల జగన్ ముఖ్య అనుచరుడైన ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని మరో కోఆర్డినేటర్‌గా నియమించారు. దీంతో ముత్తా శశిధర్ నిరాశకు గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. జగన్ కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్న ద్వారంపూడిని కాదని శశిధర్‌కి టికెట్ ఇస్తారనుకోలేమనే మాట వినిపిస్తోంది. దాంతో ముత్తా శశిధర్‌పై అనుచరుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఏదో ఒకటి తేల్చుకోవాలని వారు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

షర్మిలా రెడ్డి తీవ్ర ప్రయత్నం
రాజమహేంద్రవరం అర్బన్ అసెంబ్లీ సీటు కోసం కార్పొరేషన్ వైసిపి ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ఎన్నికలలో ఇద్దరు, ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించే అవకాశం ఉందని, అందులో షర్మిలారెడ్డికి కూడా జగన్ అవకాశం కల్పిస్తారని అంటున్నారు.

టీడీపీ నుంచి వీరు...
తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చేవారిపై పికె బృందం ఆరా తీసినట్టు తెలుస్తోంది. జగ్గంపేట నుంచి టికెట్ ఇస్తే తాను వైసీపీలోకి వస్తానని టిడిపి ప్రజాప్రతినిధి ఒకరు చెప్పినట్లు సమచారం. గతంలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఓ యువనేత కూడా టికెట్ ఇస్తే వైసిపిలోకి వస్తారని అంటున్నారు. ఈ విషయాలపై జగన్ తీవ్రంగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications