పవన్ కల్యాణ్ అనే నేను... దద్దరిల్లాలి!
పవన్ కల్యాణ్ అనే నేను అన్న ఒక్క మాట వినేందుకు అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో శాసనసభలో ఉంటారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానుల హర్షధ్వానాలతో ఏపీ, తెలంగాణ దద్దరిల్లనున్నాయి. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. పోలింగ్ ముగిసిన రోజు నుంచి పవర్ స్టార్ గెలుపు ఖాయం.. మెజారిటీ ఎంత? అనేదే తేలాల్సి ఉంది అంటూ చర్చ నడుస్తోంది.
వ్యూహాత్మకంగా వైసీపీ..
పవన్ కల్యాణ్ విజయంపై జనసేన పార్టీతోపాటు ఆయన అభిమానులకు అంత నమ్మకం ఉంది. వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి మహిళా అభ్యర్థి వంగా గీతను బరిలోకి దింపినప్పటికీ పోలింగ్ సరళిని బట్టి చూస్తే పవన్ గెలుపు ఖాయం అంటున్నారు. తన గెలుపు కోసం కుటుంబ సభ్యులే కాకుండా సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా పిఠాపురం వచ్చి ప్రచారం చేశారు. కచ్చితంగా శాసనసభలో పవన్ కల్యాణ్ అడుగుపెడతారంటున్నారు.

రికార్డు స్థాయిలో మెజారిటీ?
గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేసినప్పటికీ ఓటమి పాలవడం జనసేనానితోపాటు అభిమానులను కూడా తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. ఈసారి మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించి తెలుగుదేశం పార్టీతో, బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతోపాటు కచ్చితంగా గెలవగలం అనే నమ్మకాన్ని కల్పించేలా పిఠాపురాన్ని ఎంపిక చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా పవన్ విజయానికి కృషిచేశారు. జనసేన పోటీచేసిన 21 అసెంబ్లీ సీట్లలో సగానికిపైగా గెలుచుకుంటుందని జనసైనికులు చెబుతున్నారు. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ కు రాష్ట్రంలో ఎవరికీ రానంతగా రికార్డు స్థాయి మెజారిటీ వస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. అంచనాలను అందుకుంటారా? లేదా? అనేది నాలుగోతేదీన వెల్లడికానుంది.












Click it and Unblock the Notifications