రాజధాని: బాబుకు 'కొత్త' ఇంటిపోరు, భూమా హెచ్చరిక
హైదరాబాద్/కర్నూలు: రాయలసీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్లు, ఆందోళనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దకు కొత్త ప్రతిపాదన తీసుకు వచ్చారు. విజయవాడ - గుంటూరు ప్రాంతాన్ని రాజధాని చేసే పక్షంలో కర్నూలును రాష్ట్రానికి రెండో రాజధానిగా ప్రకటించాలని వారు చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారట.
ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి రాజధాని కోసం రాయలసీమలో జరుగుతున్న ఆందోళనలను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లారు. ఏపీలో అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని చంద్రబాబు చెప్పారు. అయినప్పటికీ రాజధాని డిమాండ్ తీవ్రమవుతోంది. ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌కు రాకుండా కర్నూలును రెండో రాజధానిగా చేయడానికి బాబు మీద మరింత ఒత్తిడి తీసుకురావాలని ఆ ప్రాంత నేతలు భావిస్తున్నారు. బాబును ఒప్పించేందుకు చూస్తున్నారట.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధానిగా గుంటూరును ఎంపిక చేస్తే రాయలసీమలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హెచ్చరించారు.
కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలని ప్రజలు ఆందోళన చేస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్ని ఇసుమంత కూడా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం గుంటూరు నామస్మరణ మాని, రాజధాని ఎంపిక విషయంలో రాయలసీమ ప్రజల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలాన్నారు.












Click it and Unblock the Notifications