పవన్ పై విరుచుకుపడుతున్న టీడీపీ మీడియా.. రీజన్ ఇదే...!
ఏపీలో గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు జైలు పాలయ్యాక ఆయనకు జనసేన అధినేత హోదాలో వెళ్లి అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ ను అప్పట్లో టీడీపీ నేతలు, ఆ పార్టీ అనుకూల మీడియా ఆకాశానికెత్తేసింది. అయితే సీన్ కట్ చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరుపై అదే మీడియా విరుచుకుపడుతోంది. పవన్ ఎలా పనిచేయాలో చెప్తూ సదరు మీడియా ఛానళ్లు, పత్రికల్లో కథనాలు కనిపిస్తున్నాయి. అయితే ఇంతలోనే ఏమైదని ఆరా తీస్తే అసలు విషయం తెలుస్తోంది.
తాజాగా తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు వెళ్లి ఘటనా స్ధలిని పరిశీలించడంతో పాటు బాధితుల్ని పరామర్శించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు కూడా ప్రకటించారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తిరుపతికి హడావిడిగా వెళ్లి ఘటనా స్ధలిని చూసి బాధితుల్ని ఆస్పత్రుల్లో పరామర్శించారు. అక్కడితో ఆగకుండా సీఎం చంద్రబాబు ఇన్ పుట్స్ తీసుకుని పరోక్షంగా క్లీన్ చిట్ ఇచ్చిన టీటీడీ బోర్డు అధికారుల్ని టార్గెట్ చేస్తూ పవన్ తీవ్ర విమర్శలు చేశారు.

దీంతో ఈ వివాదం కాస్తా పవన్ కళ్యాణ్ వర్సెస్ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నట్లుగా మారిపోయింది. చివరికి తిరుపతి ఘటనకు ప్రభుత్వం తరఫున తాను క్షమాపణలు చెప్పిన పవన్ కళ్యాణ్ .. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో సైతం క్షమాపణలు చెప్పించారు. తొలుత ఎవరో అడిగితే క్షమాపణలు చెప్పాలా అని ప్రశ్నించిన బీఆర్ నాయుడు ఆ తర్వాత సారీ చెప్పేశారు. అయితే ఇక్కడే టీడీపీ అనుకూల మీడియా ఇగో హర్ట్ అయినట్లు తెలుస్తోంది.
తిరుపతి పర్యటనకు సీఎం చంద్రబాబు వెళ్లి ఓవైపు అధికారులతో సమీక్షలు చేసి నిర్ణయాలు ప్రకటిస్తుంటే దానికి సమాంతరంగా పవన్ కళ్యాణ్ వెళ్లి అధికారుల్ని టార్గెట్ చేయడం, వారితో క్షమాపణలు చెప్పించే వరకూ వదిలిపెట్టకపోవడం టీడీపీ మీడియాకు ఆగ్రహం కలిగించినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ ఓ మంత్రి మాత్రమేనని, ఆయన పరిధి తెలుసుకుని పనిచేయాలని, సీఎం చంద్రబాబుతో పోటీపడటం సరికాదనే అర్దం వచ్చేలా కథనాలు వండి వారుస్తున్నారు. దీంతో భవిష్యత్తులో ఏం జరగబోతోందో అర్థమవుతోందనే చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications