రఘురామకు సుప్రీంకోర్టు షాక్..! సీబీఐకి కీలక ఆదేశాలు..!
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ ఎమ్మెల్యే కూడా అయిన కనుమూరు రఘురామకృష్ణ రాజుకు (Raghurama Krishna Raju) ఇవాళ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్యాంక్ రుణాల ఎగవేత కేసులో తమపై జరుగుతున్న దర్యాప్తును నిలిపేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన రఘురామకృష్ణరాజు సహా ఇతర డైరెక్టర్లకు సుప్రీం షాకిచ్చింది. దర్యాప్తు ప్రక్రియలో జోక్యం చేసుకోబోమంటూ వీరు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లను డిస్మిస్ చేసింది. దీంతో వీరు ఇప్పుడు సీబీఐ దర్యాప్తు ఎదుర్కోవాల్సి ఉంది.
ఇండ్ భారత్ పవర్ జెన్ కామ్ లిమిటెడ్ లో డైరెక్టర్ గా ఉన్న రఘురామకృష్ణరాజు, ఇతరులు ప్రస్తుతం రూ.237 కోట్ల మేర బ్యాంకు రుణాలు తీసుకుని ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నిధులను తమ సొంత సంస్థలకు మళ్లించుకున్న వ్యవహారంలో వీరిపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. దీంతో వీరంతా తమపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లను కొట్టేయాలంటూ సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. అయితే సీబీఐ వాదనతో పాటు ఇతర ఆధారాలు పరిశీలించిన అత్యున్నత న్యాయస్దానం వీరి క్వాష్ పిటిషన్లను డిస్మిస్ చేసింది. అంతే కాదు కేసు దర్యాప్తుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు సీబీఐకి కీలక ఆదేశాలు జారీ చేసింది.

బ్యాంకులకు రుణాల ఎగవేత ఆరోపణలపై నమోదు చేసిన ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతే కాదు 16 వారాల్లోకా దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్లు దాఖలు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. దీంతో రఘురామకృష్ణ రాజు సహా ఇండ్ భారత్ జెన్ కామ్ కు చెందిన ఇతర డైరెక్టర్లకూ కష్టాలు తప్పేలా లేవు. ఈ కేసు నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు కూటమిలోకి చేరినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. రఘురామ కొంతకాలంగా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. తనపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కస్టోడియల్ దాడిపై తగు చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండిపోతోందని పలుమార్లు ఆరోపించిన రఘురామ.. తాజాగా సైలెంట్ అయిపోవడం చర్చనీయాంశమవుతోంది.














Click it and Unblock the Notifications
