ఏపికి మరో తాత్కాలిక రాజధాని ఎందుకు: రఘువీరా
విజయవాడ: హైదరాబాద్‌లో తాత్కాలిక రాజధాని ఉండగా మరో తాత్కాలిక రాజధాని ఎందుకు అని ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి ప్రశ్నించారు. తాత్కాలిక రాజధానిగా విజయవాడను ఎంపిక చేయడం శివరామకృష్ణన్ కమిటీ పనితీరుపై ప్రభావం చూపుతుందని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రాజధాని ఎంపిక కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఎలాంటి ప్రభావాలకు లోనుకాకుండా పారదర్శకంగా నివేదిక సమర్పించాలని రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. తాత్కాలిక రాజధాని ప్రకటనతో ప్రజల మధ్య విద్వేషాలు పెరుగుతున్నాయన్నారు.

రైతుల ఇన్సురెన్స్ డబ్బులు ఖజానాకు మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. రుణమాఫీపై షరతులు సరికాదని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకూ ప్రభుత్వం వెంటపడతామని రఘువీరా స్పష్టం చేశారు. రైతులు, మహిళలకు పూర్తిగా రుణమాఫీ చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. మీడియా సమావేశంలో రఘువీరా రెడ్డితోపాటు మాజీ పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఉన్నారు.
కాంగ్రెస్ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది: హరిబాబు
కాంగ్రెస్ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. విజయవాడ సూర్యారావుపేటలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భవిష్యతులో ప్రజల జీవన ప్రమాణాలు పెంచాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. స్వాతంత్ర్య వేడుకల్లో ఏపి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, పలువురు బిజెపి నేతలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications