హౌరా-చెన్నై రైల్వే విస్తరణలో నక్కతోక తొక్కిన ఏపీ!
భారతీయ రైల్వే రైల్వే విస్తరణపై దృష్టి సారించింది. పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య, సరకు రవాణా అవసరాలు దృష్ట్యా రైల్వే శాఖ ప్రధాన మార్గాలను విస్తరించే ప్రాజెక్టులు చేపట్టింది. అందులో భాగంగా హౌరా-చెన్నై మార్గాన్ని కూడా విస్తరిస్తోంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కూడా నక్కతోక తొక్కినట్టు అయ్యింది.
హౌరా-చెన్నై మార్గాన్ని విస్తరించే క్రమంలో ఈ మార్గం ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్ఛాపురం నుంచి తడ వరకు 962.50 కి.మీ. ఉంది. దీనివల్ల ప్రయాణికుల రైళ్లు మరిన్ని నడపవచ్చు. సరకు రవాణా రైళ్లు మధ్యలో అనేక చోట్ల నిలపకుండా నిరంతరాయంగా జరగవచ్చని భావిస్తున్నారు. ఈ రైల్వే విస్తరణ మార్గం 962.50 కి.మీ.లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖపట్నం పరిధిలో 897.68 కి.మీ., సదరన్ రైల్వే జోన్ చెన్నై పరిధిలో 64.83 కి.మీ. ఉంది.

గతంలో కేవలం రెండు లైన్లతో నడుస్తున్న ఈ మార్గంలో ఇప్పటికే 16.76 కి.మీ. నాలుగు లైన్లుగా విస్తరించారు. 337.36 కి.మీ.లో మూడో లైన్ నిర్మాణం పూర్తయింది. మిగిలిన 608.38 కి.మీ.లో మూడు, నాలుగు లైన్లు నిర్మించనున్నారు. ఇక ప్రస్తుతం ఇచ్ఛాపురం-విజయనగరం మధ్య 191.98 కి.మీ.లో మూడో లైన్ పనులు సాగుతున్నాయి. నాలుగో లైన్‌కు డీపీఆర్ తయారు చేయనున్నారు.
విజయనగరం-కొత్తవలస మధ్య 34.60 కి.మీ. మొత్తం మూడు లైన్లుగా విస్తరించారు. నాలుగో లైన్ పనులు కొనసాగుతున్నాయి. కొత్తవలస నుంచి విశాఖలోని సింహాచలం వరకు 16.76 కి.మీ.లో ఇప్పటికే నాలుగు లైన్లు పూర్తయ్యాయి. సింహాచలం-విశాఖపట్నం-దువ్వాడ మధ్య 26.43 కి.మీ.లో ప్రస్తుతం రెండు లైన్లు ఉండగా మూడు, నాలుగు లైన్ల పనులు జరుగుతున్నాయి. దువ్వాడ-నిడదవోలు మధ్య 205.68 కి.మీ.లో మూడు, నాలుగు లైన్ల పనులు మంజూరయ్యాయి.
నిడదవోలు-విజయవాడ మధ్య 127.02 కి.మీ.కు డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. విజయవాడ-నెల్లూరు-గూడూరు మధ్య 292.72 కి.మీ.లో మూడో లైన్ పూర్తయింది. నాలుగో లైన్‌కు డీపీఆర్ తయారు చేయాలి. గూడూరు-తడ మధ్య 67.31 కి.మీ.లో మూడు, నాలుగు లైన్ల ప్రాజెక్టు మంజూరైంది. దువ్వాడ-నిడదవోలు విభాగంలో రూ.9,889 కోట్లతో ప్రాజెక్టు మంజూరైంది. ఇందులో బైపాస్‌లు, గోదావరిపై 4.3 కి.మీ. కొత్త వంతెన నిర్మాణం ఉన్నాయి.
ధవళేశ్వరం బ్యారేజీకి, రోడ్-రైల్ వంతెనకు మధ్యలో ఈ కొత్త వంతెన వస్తుంది. తాడి వద్ద నుంచి అనకాపల్లి-ఎలమంచిలి మధ్య, తుని-అన్నవరం స్టేషన్లు టచ్ కాకుండా, కడియం నుంచి చాగల్లు వరకు బైపాస్‌లు నిర్మిస్తారు.ఈ విస్తరణ పూర్తయితే హౌరా-చెన్నై మార్గంలో రైళ్లు వేగంగా, సులభంగా నడుస్తాయి. ప్రయాణికులకు, సరకు రవాణాదారులకు భారీ ఉపశమనం లభిస్తుంది.












Click it and Unblock the Notifications
