ఏపీకి కేంద్రం శుభవార్త.. ఈ కొత్త రైల్వే లైన్లతో చిత్తూరు, తిరుపతి జిల్లాలవారికి పండుగే!
ఏపీలో రైల్వే ప్రగతి పరుగులు పెడుతోంది. కేంద్ర రైల్వే శాఖ ఇచ్చిన అనేక ప్రాజెక్ట్ లతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే రవాణా సదుపాయాల విస్తరణ జరుగుతోంది. ఇప్పటికే అమృత్ భారత్ స్టేషన్ స్కీంలో భాగంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఏపీ సర్కార్ రైల్వే అవసరాలను గుర్తించి కొత్త రైల్ లైన్ల కోసం పెడుతున్న ప్రతిపాదనలు పట్టాలెక్కుతున్నాయి.కేంద్రం చొరవతో ఏపీకి వరుస శుభవార్తలు అందుతున్నాయి.
తాజాగా అటువంటి మరో శుభవార్త చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రైల్వే కనెక్టివిటీకి కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహం అందించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రేణిగుంట-అరక్కోణం రైల్వే మార్గంలో మూడవ, నాలుగవ లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం 46 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ పరిధిలో తిరుపతి, చిత్తూరు జిల్లాల మీదుగా సాగనుంది.

రూ.1,157 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కొత్త లైన్లతో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో రైల్వే మౌలిక వసతులు మెరుగుపడనున్నాయి. ఈ కొత్త లైన్లతో రైల్వే మార్గంలో రద్దీ గణనీయంగా తగ్గి, రైళ్ల సమయపాలన మెరుగవుతుంది.
తిరుపతికి రైలు సౌకర్యం మరింత బలోపేతం కావడంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు, సాధారణ ప్రయాణికులకు మెరుగైన రవాణా అందుబాటులోకి వస్తుంది. సరకు రవాణా సామర్థ్యం పెరిగి ప్రాంతీయ ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభించనుంది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే రైల్వే అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. రేణిగుంట జంక్షన్ చుట్టుపక్కల మౌలిక సదుపాయాలు, స్టేషన్ అభివృద్ధి, ట్రాక్ బలోపేతం వంటి పనులు కొనసాగుతున్నాయి.
కొత్త లైన్ల నిర్మాణంతో ఈ జిల్లాల్లో రైల్వే నెట్‌వర్క్ మరింత బలపడనుంది. ప్రయాణికులకు సమయం ఆదా కావడంతో పాటు వాణిజ్య, పర్యాటక రంగాలకు కూడా లాభం చేకూరనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఏపీ రైల్వే అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు.













Click it and Unblock the Notifications
