చర్లపల్లి నుంచి తిరుపతికి మరో రైలు- రూట్, షెడ్యూల్..!!
తిరుపతికి వెళ్లే ప్రయాణీకులకు రైల్వే శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. వేసవి సెలవులు పూర్తయినా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి తిరుపతికి వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ప్రయాణీకుల డిమాండ్ మేరకు చర్లపల్లి నుంచి తిరుపతికి మరో ప్రత్యేక రైలు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా ఈ ప్రత్యేక రైలు నడిచే తేదీలు.. రూట్.. షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించారు.
తిరుపతికి రైల్వే శాఖ ప్రత్యేక రైలు ప్రకటించింది. చర్లపల్లి-తిరుపతి మధ్య స్పెషల్ ట్రైన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే తిరుపతికి అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా.. ఇప్పుడు మరొకటి అందుబాటులోకి తెచ్చింది. ఈ రైలు చర్లపల్లి-తిరుపతి(07819) గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఈ నెల 25న, 27వ తేదీల్లో సర్వీసులు అందించనుంది. ఇది చర్లపల్లిలో 18.10 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 07.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఇక తిరుపతి-చర్లపల్లి(07820) రైలు శుక్రవారం, ఆదివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఈ నెల 26,28వ తేదీల్లో మధ్యాహ్నం 15.00 గంటలకు తిరుపతిలో బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 04.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

ప్రయాణీకుల రద్దీ మేరకు నిర్ణయం
కాగా, ఈ రైలు జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డొర్నకల్, ఖమ్మం, మధీర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైళ్లల్లో థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే చర్లపల్లి- తిరుపతి మధ్య స్పెషల్ రైలుగా ప్రారంభమైన సర్వీసుకు ఉన్న ఆదరణతో రెగ్యులర్ సర్వీసుగా మార్పు చేసారు. కాగా, తిరుపతికి విశాఖ నుంచి వందేభారత్ స్లీపర్ ప్రకటించాలనే వినతుల పైన రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. త్వరలో తొమ్మిది వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వే శాఖ సమాయత్తం అవుతోంది. అందులో ఒకటి సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి ఖరారు చేసారు.













Click it and Unblock the Notifications