రైళ్లల్లో లోయర్ బెర్తుల కేటాయింపు పై రైల్వే శాఖ కీలక నిర్ణయం..!!
రైల్వే శాఖ లోయర్ బెర్తుల గురించి కీలక సమాచారం ఇచ్చింది. సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్తుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలనే నిబంధన ఉన్నా.. పెరుగుతున్న రద్దీ కారణంగా వారికి అవి దక్కటం గగనంగా మారుతోంది. అదే సమయంలో రాయితీల అమలు విషయంలోనూ స్పష్టత లోపించింది. కరోనా సమయంలో తీసేసిన రాయితీలను ఇప్పటికీ పూర్తి స్థాయిలో అర్హత ఉన్న వారికి పునరుద్దరించేలేదు. ఈ సమయంలో లోయర్ బెర్తుల పైన మాత్రం మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది.
వారికే ప్రాధాన్యత:రైళ్లల్లో సీనియర్ సిటిజెన్లకు అందుతున్న సౌకర్యాల పైన మంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. రైల్వే లో సీనియర్ సిటిజెన్లకు ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేసారు. ఇప్పటికే వారి కోసం రైళ్లలో కేటాయించి న లోయర్ బెర్తుల ఖరారు ప్రక్రియ కొనసాగుతుందని హామీ ఇచ్చారు.

45 ఏళ్లు పైబడిన మహిళా ప్రయాణికులు లోయర్ బెర్త్ కోసం ఏ ఎంపికను ఎంచుకోవాల్సిన అవసరం లేదని, ఈ ప్రయాణికులకు రైల్వే వైపు నుంచి ఆటోమేటిక్‌గా లోయర్ బెర్త్ లభిస్తుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలు అమలు చేస్తున్నామన్నారు.
ప్రత్యేక రిక్వెస్టు లేకుండానే:సెకండరీ స్లీపర్ కోచ్ ల్లో మొత్తం అందుబాటులో ఉన్న రిజర్వేషన్లలో 10 శాతం లోయర్ బెర్తులు సీనియర్ సిటిజెన్లకు కేటాయించనున్నారు. అదే విధంగా థర్డ్ ఏసీలో ఒక్కో కోచ్ లో 16 బెర్తులు సీనియర్ సిటిజెన్ల కు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. సెకండ్ ఏసీ కేటగిరీలో ఒక్కో కోచ్ లో 10 బెర్తులు కేటాయించారు. 60 ఏళ్లు దాటిన పురుషులు, 45 ఏళ్ల వయసు దాటిన మహిళలకు ప్రత్యేకంగా లోయర్ బెర్తు కోసం అభ్యర్ధన అవసరం లేదని..రిజర్వేషన్ సమయంలోనే ఆటోమేటిక్ గా అందుబాటులోకి వచ్చేలా విధానం అమలవుతోందని వెల్లడించారు.
రాయితీలపై పునరాలోచన:సీనియర్ సిటిజన్‌లతో పాటుగా దివ్యాంగులకు ఖచ్చితంగా లోయర్ బెర్తు ఇవ్వాల్సిందిగా స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని వివరించారు. రైలులో ఏదైనా లోయర్ బెర్త్ ఖాళీగా ఉంటే ఆన్‌బోర్డ్ ద్వారా మహిళలకు కేటాయింపుకు వీలుగా నిబంధన రూపొందించారు.
కరోనా కు ముందు రైళ్లల్లో సీనియర్ సిటిజెన్స్ కు అన్ని కేటగిరీల్లోనూ రాయితీ అందేది. తిరిగి అమలు కోసం రైల్వే శాఖ పైన ఒత్తిడి పెరుగుతోంది. గతంలో ఏ వర్గాలకు ఎంత మేర రాయితీ ఇస్తున్నాయో లెక్కలు చెబుతున్న రైల్వే శాఖ..ఈ విషయం పైన మాత్రం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.












Click it and Unblock the Notifications