ఏపీపై వరుణుడి దండయాత్ర.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం విశాఖ నుండి గుంటూరు వరకు విస్తరించి ఉందని, ఇది ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో గుంటూరు దగ్గర తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత క్రమంగా సాయంత్రానికి తెలంగాణ వైపు వెళుతుందని రేపు ఉదయానికి ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర పైన తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు
ప్రస్తుతం ఏపీలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర,దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉందని, 48గంటల్లో దక్షిణఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని నిన్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

3రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
దీని ప్రభావంతో రాష్ట్రంలో 3రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాలలో కొన్ని చోట్ల తేలిక నుండి ఒక మోస్తరు వర్షపాతం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ జిల్లాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు
కాగా నేడు ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ వెల్లడించారు. అంతేకాదు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి పశ్చిమమధ్య,ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం తోపాటు, దీనికి అనుబంధంగా ద్రోణి కొనసాగుతుందని తెలిపారు.
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు
.తీరం వెంబడి 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇక భారత వాతావరణ కేంద్రం చెప్పిన దాని ప్రకారం ఈరోజు కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయి. ఏపీలో ఈరోజు రోజంతా మేఘాలు ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ కేంద్రం పేర్కొంది.












Click it and Unblock the Notifications