రేపు ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. కారణం ఇదే..!
ఏపీలోని ఈ జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు అక్టోబర్ 22 న సెలవు ప్రకటించారు అధికారులు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో అక్టోబర్ 22 బుధవారం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. అలాగే చిత్తూరు జిల్లాలోనూ భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా అక్టోబర్ 22న అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అలాగే జూనియర్ కళాశాలలకు కూడా సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు డీఈఓలు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. అన్ని పాఠశాలకు సెలవు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే సంబంధిత ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించినట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. దీని ప్రభావంతో అక్టోబర్ 22 న బుధవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని అధికారులు అంచనా వేశారు. అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

అటు తెలంగాణలోనూ అక్టోబర్ 22న తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 23వ తేదీన ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.












Click it and Unblock the Notifications