జగన్ పార్టీలో నేను: పవన్ కళ్యాణ్, జనసేనపై రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
అమరావతి: జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజోలు నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో జనసేన, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాపాక చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

పవన్ కళ్యాణ్, జనసేనపై రాపాక సంచలనం
రాజోలు నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందనీ.. ఇప్పుడు మళ్లీ జగన్ హయాంలో అభివృద్ధి జరుగుతోందని అన్నారు. పార్టీ అధినేతే విజయం సాధించలేదంటూ జనసేనాని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి పరోక్షంగా రాపాక వరప్రసాద్ విమర్శలు చేశారు. తాను గెలిచి పార్టీ నిలబడేది కాదని.. భవిష్యత్‌లో ఆ పార్టీకి మనుగడ కూడా ఉండదని జనసేనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ టికెట్ ఇస్తా అన్నారు కానీ..
2019 ఎన్నిల్లోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ కోసం ప్రయత్నించానని, టికెట్ ఇవ్వడానికి జగన్ కూడా అంగీకరించారని రాపాక వరప్రసాద్ చెప్పారు. అయితే, తప్పనిసరి పరిస్థితిలో బొంతు రాజేశ్వరరావుకు వైసీపీ టికెట్ ఇచ్చారని తెలిపారు. దీంతో తాను ఖాళీగా కూర్చుని ఉంటే జనసేనకు సంబంధించిన కొందరు తన ఇంటికి వచ్చి పార్టీలో చేరాలని కోరారని తెలిపారు. గతంలో రాజులు నియోజకవర్గంలో ఎస్సీ ఓటింగ్ ఎక్కువగా ఉండేదనీ, ఇప్పుడు కాపుల ఓటింగ్ పెరిగిందని తెలిపారు. ఈ క్రమంలో తాను జనసేనలో చేరినట్లు చెప్పారు.

గెలిచాక జగన్మోహన్ రెడ్డిని కలిశా..
అయితే, తాను ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లు రాపాక తెలిపారు. ఆ సమయంలో తాను టికెట్ ఇవ్వలేకపోయానని సీఎం తనతో చెప్పారని వెల్లడించారు. అయినా పర్వాలేదు.. కలిసి పనిచేద్దామని చెప్పారని తెలిపారు. అప్పట్నుంచే తాను వైసీపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. రాజోలు నియోజకవర్గానికి సీఎం నిధులు కేటాయించారన్నారు.
Recommended Video

జగన్ ఒక్క మాట చెబితే చాలు..
ప్రస్తుతం తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కిందే నడుస్తున్నానని వరప్రసాద్ తెలిపారు. రాజోలులో మూడు గ్రూపులు ఉన్నాయని, తనదో గ్రూపు అని చెప్పారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెబితే ఏ గ్రూపులూ, గొడవలు ఉండవని చెప్పారు. తాను అందర్నీ కలుపుకుని పోతున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications