రాప్తాడు బాలికపై దాడి కేసు నిందితుడు హేమంత్ ఆరోగ్య పరిస్థితి విషమం!
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలో సంచలనం సృష్టించిన బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసి హత్యాయత్నం కేసులో నిందితుడు హేమంత్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఈ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ప్రధాన నిందితుడైన హేమంత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే.
దారుణానికి సంబంధించి సీన్ రీ క్రియేట్ చేసే సందర్భంలో అతను పారిపోవటానికి ప్రయత్నం చేయగా పోలీసులు అతడిని పట్టుకోవటానికి కాళ్ళపై కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాల పాలైన అతడిని పోలీసులు ఆస్పత్రిలో చేర్పించగా అతని ఒకకాలు పూర్తిగా తోలిగించాల్సి వచ్చింది. అయితే నిందితుడు కాస్త కోలుకున్నాక పోలీసులు విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నారు.

పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు హేమంత్‌కు ఒక్కసారిగా ఆరోగ్య సమస్య తలెత్తడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తడంతో పాటు గుండె సంబంధిత నొప్పితో అతను బాధపడటంతో, ముందుగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి మరింత విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అతడిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. వైద్యుల ప్రాథమిక అంచనా ప్రకారం అతనికి 'పల్మనరీ ఎంబోలిజం' సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.
నిందితుడు ఇలా అకస్మాత్తుగా అనారోగ్యంపాలవ్వడం, ఊపిరితిత్తుల్లో రక్తనాళాలు గడ్డకట్టడంతో ఆస్పత్రిలో చేర్పించారు. బాధితురాలైన బాలిక ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతోంది. బాలిక ఆరోగ్యం నిలకడగా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందిస్తోంది. బాధితురాలి కుటుంబానికి అండగా నిలుస్తామని ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు భరోసా ఇస్తున్నాయి.
ఇలాంటి అత్యంత హేయమైన నేరాలకు పాల్పడిన వారికి చట్టపరంగా కఠినమైన శిక్షలు పడేలా చూడాలని, ఎలాంటి లోపాలకు తావు లేకుండా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయాలని అన్ని వర్గాల నుండి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు కోలుకున్న వెంటనే అతనిని తిరిగి విచారించి, చట్టం ముందు నిలబెట్టేందుకు పోలీస్ యంత్రాగం సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications
