పుత్రుడి ఉదంతంపై మంత్రి రావెల స్పందన: రాజీనామాకు ఈశ్వరి డిమాండ్
హైదరాబాద్: తన తనయుడు సుశీల్ ఓ మహిళా టీచర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు స్పందించారు. తాను కేసులో జోక్యం చేసుకోబోనని, చట్టంపై తనకు గౌరవం ఉందని ఆయన శనివారంనాడు అన్నారు.
నేరం ఎవరు చేసినా అంగీకరించే తత్త్వంతనది కాదని ఆయన అన్నారు. కేసును తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, నేరం జరిగిందా లేదా అనేది దర్యాప్తులో తేలుతుందని ఆయన అన్నారు. ఇలాంటి సమయంలో విమర్సలు చేయడం సరి కాదని రావెల అన్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో రావెల కిశోర్ బాబు గిరిజన శాఖ మంత్రిగా ఉండడం సిగ్గుచేటుగా భావిస్తున్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పాడేరు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి అన్నారు. గతంలో తాము ఏమైనా మాట్లాడితే అజ్ఞానులు అనేవారని, కానీ కిశోర్ బాబు 55 ఎకరాల అసైన్డ్ భూములను స్వాహా చేశాడని, మంత్రి కుమారుడు ఓ టీచర్‌పై అత్యాచార యత్నం చేయడం దారుణమని ఆమె అన్నారు.

రావెల సుశీల్‌ను అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రావెల మంత్రి పదవికి రాజీనామా చేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రపంచస్థాయి రాజధాని అంటున్నారు గానీ పేద రైతులు, పేద కూలీలను మోసగిస్తూ వాళ్ల భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో స్వాహా చేస్తున్నారని మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. టిడిపి ఎంపీలు, మంత్రులు అందరూ బినామీ పేర్లతో భూములను ఆక్రమించుకున్నారని, ఓటుకు నోటు కేసులో పూర్తిగా మునిగిపోయి వీటిని పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.
రాజధాని అభివృద్ధి పేరుతో రైతులను భయపెట్టి, హింసించి వాళ్ల పొట్ట గొట్టి భూములు లాక్కున్నారని ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ఆరోపించారు. ఆ డబ్బును ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనేందుకు వాడుతున్నారని ఆమె ఆరోపించారు. మంత్రులు భూములు కొనుక్కుంటే త్పపేమిటని చంద్రబాబు అనడం దురదృష్టకరమని అన్నారు. మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణకు ఆదేశించాలని ఆమె డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications