చీఫ్ సెక్రటరీని జైలుకు పంపుతాం : సీమ ఎత్తిపోతల పనులపై : ఏపీ ప్రభుత్వానికి హెచ్చరిక..!!
రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపట్టినట్లు తేలితే చీఫ్ సెక్రటరీని జైలుకు పంపుతామంటూ హెచ్చరించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు జరపొద్దని గతంలో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘిస్తూ రాయలసీమ ఎత్తిపోతల పనులు చేస్తున్నారని తెలంగాణ సర్పంచ్ ల సంఘం నేత గవినోళ్ల శ్రీనివాస్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసారు.
Recommended Video

సీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో విచారణ..
కోర్టు ధిక్కరణ పిటిషన్ ను విచారించిన జస్టిస్ రామకృష్ణన్ , ఎక్స్ పర్ట్ మెంబర్ సత్యగోపాల్ లతో కూడిన ఎన్జీటీ చెన్నై ధర్మాసనం ఈ మేరకు సీరియస్ వ్యాఖ్యలు చేసారు. ఎన్ జి టి ఆదేశాలను ధిక్కరించి ఎపి ప్రభుత్వం కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ సందర్భంగా పనులను చేపడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంను తనిఖీలు జరపాలన్న ఎన్ జి టి ఆదేశాల మేరకు తనిఖీ జరపుతామన్న కృష్ణ నది యాజమాన్య బోర్డుకు ఎపి ప్రభుత్వం సహకరించడం లేదని ఎన్టీటీకి నివేదించారు.

తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు..
ఒకవైపు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి పర్యావరణ అనుమతులు తప్పనిసరి ఎన్ జి టి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఎలాంటి అనుమతులు అవసరం లేదని కేంద్ర పర్యావరణ శాఖకు ఎపి ప్రభుత్వం లేఖలు రాస్తోందని చెప్పుకొచ్చారు. దీని పైన తెలంగాణ ప్రభుత్వం అదనపు అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు వాదనలు వినిపించారు. ఎన్ జి టి ఇచ్చిన తీర్పు అమలు కావడం లేదని బెంచ్ కు నివేదించారు. చట్టం అమలు అయ్యేలా చూడాలని కోరారు. ఎపి ప్రభుత్వం తరఫు న్యాయవాది దొంతి మాధురి రెడ్డి వాదనలు వినిపిస్తూ..రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద నిర్మాణం పనులు చేపట్టడం లేదన్నారు. రెండు వారాలు సమయం ఇస్తే కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు.

సీఎస్ ను జైలుకు పంపుతాం
తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా ప్రాజెక్టులు అనుమతులు లేకుండా చేపడుతోందని ఫిర్యాదు చేసారు. దీంతో వాదనలు విన్న బెంచ్.. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు, చెన్నైలోని కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయానికి ఆదేశించింది. తీర్పు ఉల్లంఘించినట్లు తేలితే ఎపి చీఫ్ సెక్రటరీని జైలుకు పంపుతామంటూ ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తదుపరి విచారణ జులై 12 కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications