రాయలసీమ దశ తిరిగేలా పెట్టుబడుల వెల్లువ.. రూ.5,217 కోట్ల 23 ఒప్పందాలు!
రాయలసీమ ప్రాంతం ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధిలో కొత్త అధ్యాయం రాస్తోంది. అనంతపురంలోని జేఎన్‌టీయూ క్యాంపస్‌లో తాజాగా జరిగిన సీఐఐ ప్రాంతీయ భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం వివిధ కంపెనీలతో రూ.5,217.39 కోట్ల విలువైన 23 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా స్థానిక యువతకు 7,613 ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
రాయలసీమను పారిశ్రామిక తయారీ కేంద్రంగా, అలాగే గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.ఆటోమొబైల్ విడిభాగాలు, ఏరోస్పేస్, రక్షణ, ఉక్కు, ఆహార ప్రాసెసింగ్, హోటళ్ల రంగాల్లో ఈ పెట్టుబడులు రావాల్సి ఉంది. శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలోకి కియా ప్లాంట్ పరిసరాల్లో హ్వాసిన్ ఆటోమోటివ్ రూ.850 కోట్లతో ఫోర్ వీలర్ విడిభాగాల యూనిట్, సియోయాన్ సంస్థ రూ.514 కోట్లతో ఆటోమొబైల్ ఇంటీరియర్ భాగాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నాయి.

కర్నూలులో ఇవామెట్ ఇండియా రూ.250 కోట్లతో మరో ఆటో విడిభాగాల యూనిట్ స్థాపించనుంది.ఏరోస్పేస్, రక్షణ రంగంలోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రూ.435.75 కోట్లతో 600 ఎకరాల్లో డ్రోన్ సిటీ అభివృద్ధి జరుగుతోంది. అజిస్తా కాంపోజిట్స్ రూ.810 కోట్లతో ఏరోస్పేస్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది. వీరా టాక్టికల్ డైనమిక్స్ రక్షణ పరికరాల కోసం రూ.165 కోట్లు, స్టార్మింగ్ యూనివర్స్ డ్రోన్ తయారీకి రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి.
టేకులోడు ఏరోస్పేస్ పార్కులో అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టు కోసం రూ.2 వేల కోట్లతో ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ రానుంది. ఉక్కు రంగంలోనూ ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. అనంతపురంలో హరిఓమ్ పైప్స్ ఇండస్ట్రీస్ రూ.700 కోట్లతో సమీకృత ఉక్కు కర్మాగారం, కర్నూలులో స్టెడ్‌ఫాస్ట్ స్టీల్స్ రూ.536 కోట్లతో ఉక్కు యూనిట్ ఏర్పాటు చేయనున్నాయి. హార్టికల్చర్ రంగంలో నకోడా డెయిరీ చిత్తూరులో రూ.340 కోట్లతో ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పనుంది.
టెక్స్‌టైల్స్, హోటళ్ల రంగాల్లోనూ కొన్ని ఒప్పందాలు జరిగాయి. రాష్ట్ర ఆహారశుద్ధి శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి మాట్లాడుతూ, గతంలో కుదిరిన పారిశ్రామిక ఒప్పందాల్లో 70 శాతానికి పైగా అమల్లోకి వచ్చాయని తెలిపారు. ఏపీఐఐసీ ఎండీ దినేష్ కుమార్ మాట్లాడుతూ, గత రెండేళ్లలో రాష్ట్రానికి రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని, వాటిలో రూ.16.16 లక్షల కోట్లు కేటాయింపుల రూపంలోకి మారాయని వెల్లడించారు.
రాయలసీమ చాలా కాలంగా పారిశ్రామికంగా వెనుకబడి ఉందనే భావన ఉండేది. కరువు, నీటి సమస్యలు, ఉపాధి లేకపోవడం వంటి సమస్యలు ఈ ప్రాంత ప్రజలను వేధించేవి. ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు ఆకర్షించడం సానుకూల పరిణామం అన్నారు. కియా లాంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే ఇక్కడ ఉన్నాయి. వాటి చుట్టూ అనుబంధ పరిశ్రమలు రావడం వల్ల స్థానిక యువతకు మంచి ఉపాధి దొరుకుతుంది. ఈ పెట్టుబడుల వెల్లువ కొనసాగితే ప్రాంతీయ అసమానతలు తగ్గి, రాయలసీమ కూడా ఆంధ్రప్రదేశ్‌లోని అభివృద్ధి చెందిన ప్రాంతాలలో భాగం అవుతుంది.













Click it and Unblock the Notifications
