జగన్‌కు కేంద్రం "గ్రాంట్" - వేడి చల్లారేలా: నేడే విడుదల..!
న్యూఢిల్లీ: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు- ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార పార్టీపై దాడికి దిగుతున్నారు. నిధుల కేటాయింపుల్లో వివక్షతను ప్రదర్శిస్తోందంటూ మండిపడుతున్నారు. జీఎస్టీ బకాయిలు, రెవెన్యూ లోటు నిధుల మంజూరులో ఉద్దేశపూరకంగా జాప్యం చేస్తోందనీ ధ్వజమెత్తుతున్నారు. మంగళవారం నాడే రాజ్యసభలో వైసీపీ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి అధికార పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలనూ ఆయన ప్రస్తావించారు.
ఇది యాధృచ్ఛికమే అయినప్పటికీ- రాజ్యసభలో విజయసాయి రెడ్డి మాట్లాడిన మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం ఏపీ సహా 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు గ్రాంట్‌ను మంజూరు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తంగా 7,183 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఇందులో ఏపీ వాటా 879.08 కోట్ల రూపాయలు. ప్రస్తుత ఆగస్టు నెలకు సంబంధించిన మొత్తం ఇది.

ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికీ 14 రాష్ట్రాలకు విడుదల చేయాల్సిన పీడీఆర్డీజీ నిధులు 86,201 కోట్ల రూపాయలు. దీన్ని దశలవారీగా విడుదల చేస్తుంది ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన సిఫారసుల ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీకి రావాల్సిన రెవెన్యూ లోటు గ్రాంట్ 10,549 కోట్ల రూపాయలు. ఇందులో ప్రస్తుత ఆగస్టు నెల కోసం 879.08 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్రాలవారీగా చూస్తే.. అస్సాం-రూ.407.50, హిమాచల్ ప్రదేశ్-781.42, కేరళ-1,097.83, మణిపూర్-192.50, మేఘాలయా-86.08, మిజోరం-134.58, నాగాలాండ్-377.50, పంజాబ్-689.50, రాజస్థాన్-405.17, సిక్కిం-36.67, త్రిపుర-368.58, ఉత్తరాఖండ్-594.75, పశ్చిమ బెంగాల్-1,132.25 కోట్ల రూపాయలను గ్రాంట్‌ను విడుదల చేసినట్లు వెల్లడించింది.












Click it and Unblock the Notifications