ఏపీ సీఐడీ అదనపు డీజీపై ఢిల్లీ పోలీసులకు రఘురామ ఫిర్యాదు: పీవీ రమేష్‌తో కుటుంబ కలహాలు
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు.. జగన్ సర్కార్‌పై దేశ రాజధానిలో తనకు ఉన్న పలుకుబడిని మరోసారి ప్రయోగించారు. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే చర్యలను కొనసాగిస్తూనే వస్తోన్నారు. తాజాగా ఏపీ సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ పీవీ సునీల్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆయనపై క్రిమినల్ కేసులను నమోదు చేసే దిశగా పావులు కదిపారు. దీనికోసం ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్‌కు మూడు పేజీల ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. పీవీ సునీల్ కుమార్‌పై క్రిమినల్ కేసు ఎందుకు నమోదు చేయాలనే విషయానికి గల కారణాలను వివరించారు.

రఘురామ వాట్సప్ నుంచి పీవీ రమేష్‌కు మెసేజెస్
ప్రభుత్వ మాజీ సలహాదారు డాక్టర్ పీవీ రమేష్‌కు వాట్సప్ సందేశాలు వెళ్లిన విషయాన్ని రఘురామ తన ఫిర్యాదులో పొందుపరిచారు. తన మొబైల్ ఫోన్‌లో సేవ్ చేయని నంబర్ నుంచి మెసేజీలు వస్తున్నాయంటూ పీవీ రమేష్ ట్వీట్ చేయడం.. దానికి తాను వివరణ ఇస్తూ రిప్లై ఇచ్చిన ట్వీట్ సారాంశం గురించి రఘురామ ఇందులో రాసుకొచ్చారు. కిందటి నెల 14వ తేదీన సీఐడీ అధికారులు తనను అరెస్ట్ చేసిన సందర్భంగా తాను వినియోగించే ఐఫోన్ మోడల్ 11ను వారు స్వాధీనం చేసుకున్నారని, దాని పాస్‌వర్డ్ కూడా వారికి తెలుసునని చెప్పారు. సీఐడీ అధికారుల ఆధీనంలో ఉన్న ఫోన్ నుంచి పీవీ రమేష్‌కు మెసేజీలు వెళ్లడం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని పేర్కొన్నారు.

కుటుంబ వివాదాలు..
ఏపీ సీఐడీ డీజీ పీవీ సునీల్ కుమార్.. పీవీ రమేష్ చెల్లెలి మధ్య కుటుంబ పరమైన విభేదాలు ఉన్నాయనే విషయం తన దృష్టికి వచ్చిందని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కేసొకటి హైకోర్టులో పెండింగ్‌లో ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో- పీవీ సునీల్ కుమార్ ఆధీనంలో ఉన్న తన మొబైల్ ఫోన్ వాట్సప్ నుంచి పీవీ రమేష్‌కు మెసేజీలు వెళ్లడం వల్ల తన ప్రతిష్ఠకు భంగం కలుగుతున్నట్లుగా భావిస్తున్నానని రఘురామ చెప్పారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బ తీసేలా వ్యవహరిస్తోన్నారని అన్నారు.

పీవీ రమేష్ ట్వీట్‌తో
తాజాగా- పీవీ రమేష్ చేసిన ట్వీట్.. పీవీ సునీల్ కుమార్‌తో ఉన్న కుటుంబ వివాదానికి గుర్తు చేసినట్టయిందని రఘురామ చెప్పారు. అదే సమయంలో తన మొబైల్ ఫోన్‌ను పీవీ సునీల్ కుమార్ వినియోగిస్తోన్నారనడానికి ఇది నిదర్శనమని, ఈ విషయాన్ని తాను గట్టిగా విశ్వసించడానికి పీవీ రమేష్ చేసిన ట్వీట్ మరింత బలాన్ని ఇస్తోందని పేర్కొన్నారు. తన మొబైల్ ఫోన్ వాట్సప్ నంబర్‌ను ఆయన ఉద్దేశపూరకంగా దుర్వినియోగం చేస్తోన్నారనడానికి ఇదే సాక్ష్యమని తాను అభిప్రాయపడుతున్నట్లు రఘురామ చెప్పారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వస్తువును ఓ ఉన్నతాధికారి దుర్వినియోగం చేస్తోన్నారనే విషయం స్పష్టమైందని అన్నారు.
Recommended Video

చట్టపరమైన చర్యలు..
ఈ నేపథ్యంలో- పీవీ సునీల్ కుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ రఘురామ కృష్ణంరాజు.. ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆయనపై ఐపీసీలోని సెక్షన్లు 119, 379, 403, 409, 418, 426, 504, 506 కింద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వాటితో పాటు ఇంకా ఏవైనా సెక్షన్లు మిగిలి ఉంటే వాటిని కూడా ప్రయోగించాలని కోరారు. ఓ ఉన్నతాధికారి.. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వస్తువును దుర్వినియోగం చేయడం క్రిమినల్ చర్యల కిందికి వస్తుందని తాను భావిస్తున్నట్లు రఘురామ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications