ఉద్యోగ నేత కేఆర్ సూర్యనారాయణకు ఊరట- జగన్ సర్కార్ కు హైకోర్టు కీలక ఆదేశం !
ఏపీలో ఉద్యోగుల బకాయిలపై గవర్నర్ ను కలిసిన వ్యవహారంలో షోకాజ్ నోటీసు అందుకున్న ఉద్యోగ నేత కేఆర్ సూర్యనారాయణకు హైకోర్టు ఇవాళ ఊరటనిచ్చింది. ఆయనపై తీర్పు వచ్చే వరకూ చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
ఏపీలో ఉద్యోగుల బకాయిల వ్యవహారంలో గవర్నర్ హరిచందన్ తో భేటీ అయి ఫిర్యాదు చేసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణకు వైసీపీ సర్కార్ జారీ చేసిన షోకాజ్ నోటీసులపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఇందులో వాదోపవాదాలు విన్న హైకోర్టు తుది తీర్పును రిజర్వ్ చేసింది.
తనకు షోకాజ్ నోటీసు జారీ చేయడాన్ని ఉద్యోగ నేత కేఆర్ సూర్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. రోసా నిబంధనల ప్రకారం తనకు నోటీ జారీ చేసినట్లు ప్రభుత్వం చేస్తున్న వాదనను ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో ఈ వ్యవహారంపై హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున వాదనలు కూడా విన్న తర్వాత హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో తుది తీర్పు ఇచ్చే వరకూ కేఆర్ సూర్యనారాయణపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు జగన్ సర్కార్ కు ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు హైకోర్టు ఆదేశాలపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ స్పందించారు. ఉద్యోగులకు రావాల్సిన చెల్లింపుల విషయంలో జాప్యం జరుగుతోందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. గవర్నర్ దృష్టికి తీసుకెళ్లే ముందు చాలా మంది అధికారులను కలిసి నివేదించామన్నారు. ఉద్యోగులకు దక్కాల్సిన లెజిటిమేట్ ఫైనాన్షియల్ క్లైమ్స్ విషయంలో జాప్యం జరగ్గకుండా ఉండేలా చట్టబద్జత కల్పించాలని కోరామన్నారు..
చట్టబద్దత కల్పిస్తే ఉద్యోగులకు హక్కు వస్తుందని గవర్నరును కోరామన్నారు. ఇలా చేయడం తప్పని కొందరు తమను విమర్శించారని, తప్పు పట్టారని సూర్యనారాయణ పేర్కొన్నారు. దీన్ని బేస్ చేసుకుని సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదని ప్రభుత్వ పెద్దలు షోకాజ్ నోటీసిచ్చారన్నారు.
రోసా నిబంధనలు ఉల్లంఘించ లేదని.. గవర్నరుకు ఫిర్యాదు చేయడం తప్పు కాదని ఇవాళ కోర్టులో మేం వాదనలు వినిపించామని సూర్యనారాయణ తెలిపారు. తీర్పు రిజర్వులో ఉంచారని, తీర్పు వెలువడేంత వరకు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించిందన్నారు. మేం తప్పు చేయలేదని.. నిబంధనలు ఉల్లంఘించ లేదని కోర్టు స్పష్టతకు వచ్చిందని మేం భావిస్తున్నామన్నారు. సంఘంలో ఇంటర్నలుగా జరిగే సమావేశం వివరాలు మీడియాకు చెప్పకూడదనే నిబంధనలు ఉన్నాయే తప్ప.. రిప్రజెంటేషన్ ఇచ్చాక మీడియాతో మాట్లాడొద్దని లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లింపుల విషయంలో ప్రభుత్వం స్పందించాలన్నారు.
బాకీల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించాలని సూర్యనారాయణ కోరారు..మిగిలిన సంఘాలు కూడా వివాదాలను పక్కన పెట్టి ఉద్యోగుల సంక్షేమం కోసం ఐక్య ఉద్యమాలకు కలిసి రావాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు రూ. 20 వేల కోట్లకు పైగా ఉంటే చెల్లింపులు కష్టసాధ్యం అవుతుందన్నారు. మేం కోరిన విధంగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఉద్యోగులకు జరపాల్సిన చెల్లింపుల విషయంలో చట్టం చేయాలన్నారు. సంఘాల గుర్తింపునకు సంబంధించిన నిబంధనావళిపై చర్చ జరగాలి.. రోసా రూల్సుకు సవరణ చేయాలన్నారు. నేరుగా ఉద్యోగులే తమ నేతలను ఎన్నుకునే విధంగా నిబంధనలు సనరణ చేయాలన్నారు.












Click it and Unblock the Notifications