మాజీమంత్రి నారాయణకు ఊరట-హైకోర్టు తీర్పు రిజర్వ్- చిత్తూరు కోర్టు ఆదేశాల నిలిపివేత
ఏపీలో టెన్త్ క్లాస్ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పొంగూరు నారాయణకు తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో రేపటి లోగా లొంగిపోవాలంటూ గతంలో చిత్తూరు కోర్టు ఇచ్చిన ఆదేశాల్ని తాత్కాలికంగా నిలిపేస్తూ హైకోర్టు ఇవాళ మరో ఉత్తర్వు జారీ చేసింది.
ఇవాళ మాజీ మంత్రి నారాయణను కోర్టులో లొంగిపోవాలని చిత్తూరు సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా చిత్తూరు కోర్టు ఆదేశాలను నారాయణ న్యాయవాది సవాల్ చేశారు. హైకోర్టులో తమ పిటిషన్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో చిత్తూరు కోర్టు ఆదేశాలు నిలిపేయాలని కోరారు. దీంతో స్పందించిన హైకోర్టు.. హైకోర్టు తీర్పు ఇచ్చే వరకూ చిత్తూరు కోర్టు ఆదేశాల అమలును నిలిపేసింది.

ఈ నెల 30వ తేదీ లోపు లొంగిపోవాలని నారాయణను చిత్తూరు సెషన్స్ కోర్టు గతంలో ఆదేశించింది. పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజ్ కేసులో చిత్తూరు మెజిస్ట్రేట్ తీర్పును ప్రభుత్వం జిల్లా కోర్టులో సవాల్ చేసింది. ప్రభుత్వ వాదనతో ఏకీభవించి నారాయణ బెయిల్ ను రద్దు చేసి లొంగిపోవాలని చిత్తూరు సెషన్స్ కోర్టు ఆదేశాలిచ్చింది. సెషన్స్ కోర్టు ఆదేశాలపై నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. నారాయణ తరపు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్ద లూత్రా, హైకోర్టు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అలాగే ప్రభుత్వం తరపు అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. వాదనలు పూర్తికావడంతో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.












Click it and Unblock the Notifications