పేర్నికి హైకోర్టులో ఊరట-పోలీసులకు కీలక ఆదేశాలు..!
ఏపీలో రేషన్ బియ్యం మాయం ఘటనలో చిక్కుకుని విలవిల్లాడుతున్న వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానికి ఇవాళ ఊరట లభించింది. ఆయన భార్య పేర్ని జయసుధకు చెందిన గోడౌన్ లో పౌరసరఫరాలశాఖ నిల్వ చేసిన రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో పోలీసులు ఆయన్ను ఏ6గా చేర్చారు. దీంతో ఆయన అరెస్టు తప్పదనే ప్రచారం జరిగింది. అయితే దీనిపై హైకోర్టును ఆశ్రయించిన ఆయనకు ఊరట లభించింది.
రేషన్ బియ్యం మాయమైన ఘటనలో నేరుగా పేర్నినాని పాత్ర లేకపోయినా కుటుంబానికి చెందిన గోడౌన్ లో నిల్వ చేసిన బియ్యం కావడంతో పోలీసులు ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు అరెస్టు అయ్యారు. ఇదే కేసులో పేర్ని భార్య జయసుధ అరెస్టు కాకుండా జిల్లా కోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ కూడా ఇచ్చింది. దీంతో మిగిలిన పేర్నినాని అరెస్టు ఖాయమని అంతా భావించారు. అయితే హైకోర్టు మాత్రం ఆయన్ను సోమవారం వరకూ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇచ్చింది.

రేషన్ బియ్యం కేసులో పోలీసులు తనను ఏ6గా చేర్చిన నేపథ్యంలో పేర్నినాని ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. పేర్నినానిపై దుందుడుకు చర్యలు వద్దని పోలీసులకు సూచించింది. ఈ కేసులో వచ్చే సోమవారం విచారణ జరుపుతామని, అప్పటి వరకూ దూకుడు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. దీంతో పోలీసులు కూడా వచ్చే సోమవారం వరకూ వేచి చూడాల్సిన పరిస్ధితి..












Click it and Unblock the Notifications