ఏపీ పాఠశాలల పునర్ ప్రారంభ తేదీ పొడిగింపు: ఎందుకంటే?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలల పునర్ ప్రారంభ తేదీని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు పాఠశాలల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో జూన్ 13న పాఠశాలల తెరచుకోనున్నాయి. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
అయితే, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 12న పాఠశాలల తెరచుకోవాల్సి ఉండగా.. ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో జూన్ 13న పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా తెరచుకోనున్నాయి. జూన్ 12న ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 12న ఉదయం 11.27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు వీఐపీలు రానుండడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం ఐటీ పార్కు సమీపంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి (రవాణా, రోడ్లు, భవనాలు) ప్రద్యుమ్న పరిశీలించారు. ప్రద్యుమ్న గన్నవరంలో పర్యటించి జూన్ 12న ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాట్లను పరిశీలించారు.
గన్నవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గన్నవరం సమీపంలోని కేసరపల్లి గ్రామంలోని ఐటీ మేధా పార్కు సమీపంలో ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలు హాజరవుతారని తెలిపారు. సీటింగ్, వేదిక, బారికేడింగ్, భద్రత, పార్కింగ్, పారిశుధ్యంపై జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఇతర అధికారులతో చర్చించారు.












Click it and Unblock the Notifications