గేమ్ ఛేంజర్ గా రేవంత్ నిర్ణయం-చంద్రబాబుకు ముందస్తు ఫెస్టివల్.. !
హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్టు, విచారణ వంటి పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై సినిమాల బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వబోమని తేల్చిచెప్పేసింది. దీంతో ఇబ్బందుల్లో పడ్డ టాలీవుడ్ .. చివరి ప్రయత్నంగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ దిల్ రాజును తీసుకెళ్లి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. ఈ భేటీతో వీరిద్దరి మధ్య దూరం తగ్గుతుందనుకుంటే మరింత పెరిగేలా ఉంది. అదే సమయంలో ఈ భేటీ ప్రభావం ఏపీపైనా పడబోతోంది.
తెలంగాణలో టాలీవుడ్ సినిమాల బెనిఫిట్ షోలకు, టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వకూడదన్న తమ నిర్ణయంలో మార్పేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పేశారు. దీంతో టాలీవుడ్ కు, అందులో భాగమైన ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజుకూ భారీ షాక్ తప్పలేదు. సంక్రాంతికి గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం రూపంలో రెండు సినిమాల విడుదలకు సిద్దమైన దిల్ రాజుకు రేవంత్ నిర్ణయం మింగుడుపడని పరిస్ధితి. అలాగే తర్వాత రాబోయే సినిమాలకూ షాక్ తప్పడం లేదు.

మరోవైపు రేవంత్ రెడ్డి నిర్ణయంతో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కూటమి ప్రభుత్వం కూడా ఇరుకునపడబోతోంది. ఇప్పటివరకూ తెలంగాణతో సంబంధం లేకుండా టాలీవుడ్ చిత్రాల బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపుకు స్వతంత్రంగా అనుమతులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ నిర్ణయంతో ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్ధితి. తెలంగాణలో లేని రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఏపీలో ఎందుకన్న చర్చ మొదలైంది. దీంతో సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమాల విషయంలో ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్ధితి ఏపీ ప్రభుత్వానికి ఎదురుకాబోతోంది.
సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భారీ చిత్రం గేమ్ ఛేంజర్ తో పాటు బాలకృష్ణ డాకూ మహరాజ్ మూవీ కూడా విడుదల కావాల్సి ఉంది.ఈ రెండు చిత్రాలకు సంక్రాంతికి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ రేట్ల పెంపుకూ ఏపీ ప్రభుత్వాన్ని అనుమతి కోరేందుకు నిర్మాతలు సిద్దంగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ వారికి తెలంగాణ తరహాలో అనుమతి నిరాకరిస్తారా లేక ఇచ్చి విమర్శలు ఎదుర్కొంటారా అన్నది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications