బయట మాట్లాడను: పొన్నాల, అందుకే రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు!
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య తన పైన వచ్చిన రాంపూర్ భూముల ఆరోపణల పైన గురువారం స్పందించారు. అసైన్డ్ భూములకు సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలపై బహిరంగంగా స్పందించనని చెప్పారు. భూముల అక్రమాలపై సభాసంఘాలను ఆహ్వానిస్తున్నామన్నారు.
రేవంత్ రెడ్డి ఆగ్రహం వెనుక...!
తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెరాస ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు. తనకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వడం లేదంటూ రేవంత్ రెడ్డి శాసన సభలో హెడ్ ఫోన్ విసిరేసి, పోడియం వైపుకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. దీంతో సభాపతి సభను అరగంటపాటు వాయిదా వేసి వెళ్లిపోయారు.
శాసన సభలో వక్ఫ్, గృహ నిర్మాణ సొసైటీ భూముల్లో అక్రమాల పైన చర్చను మజ్లిస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ ప్రారంభించబోతుండగా.. రేవంత్ రెడ్డి మైక్ ఇవ్వాలని కోరారు. ప్రాధాన్యతాంశం పైన చర్చ జరుగుతుందని, ఇప్పుడు కుదరదని సభాపతి మధుసూదనాచారి చెప్పారు.

రెండు నిమిషాలైనా మాట్లాడే అవకాశమివ్వాలని ఎర్రబెల్లి దయాకర రావు కోరారు. సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని ముఖ్యమైన చర్చకు సభ్యులు సహకరించాలని, ఆ తర్వాత సభ్యుడికి అవకాశమివ్వవచ్చన్నారు. శాసన సభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు చర్చకు అడ్డు తగలాలని ప్రయత్నిస్తున్నారన్నారు.
రేవంత్ క్షమాపణ చెప్పాలని తెరాస సభ్యులు నినాదాలు చేశారు. ఈ సమయంలో జానా రెడ్డి కల్పించుకొని అక్బరుద్దీన్ మాట్లాడాక మైక్ ఇవ్వాలని కోరారు. దీంతో టీడీపీ సభ్యులు మౌనం దాల్చారు. అక్బర్ ప్రసంగం అనంతరం తెరాస సభ్యుడు సంజీవ రావుకు అవకాశం ఇచ్చారు. దీంతో టీడీపీ సభ్యులు మరోసారి మైక్ ఇవ్వాలన్నారు. కేసీఆర్ మాట్లాడుతూ.. కీలక అంశంపై చర్చకు సంబంధించి సంతకాలు పెట్టిన వారి తర్వాత మాట్లాడే అవకాశమివ్వాలని కోరడంతో చర్చ పూర్తయింది.
కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క ప్రశ్నకు కేసీఆర్ జవాబిచ్చాక మాట్లాడటానికి రేవంత్ రెడ్డి లేచారు. అయితే, ఎర్రబెల్లికి అవకాశమిస్తున్నట్లు సభాపతి పేర్కొనడంతో, తనను మాట్లాడనివ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో సహనం కోల్పోయిన రేవంత్ రెడ్డి.. హెడ్ ఫోన్స్ విసిరేశారు.
సభాపతి ముందుకెళ్లి తనను మాట్లాడనివ్వరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు కూడా రావడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో సభను భోజన విరామానికి అరగంట వాయిదా వేశారు. కాగా, తనను సభలో మాట్లాడనివ్వకుండా అడ్డుకుంటున్నారని, తాను మాట్లాడితే నిజాలు బయటకు వస్తాయనే తనను మాట్లాడనివ్వడం లేదని రేవంత్ రెడ్డి మండిపడుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications