2016 రివైండ్: బీజేపీకి చంద్రబాబు సర్‌ప్రైజ్, ఎదురుతిరిగిన పవన్, జగన్ కార్నర్
ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండేళ్లుగా ప్రత్యేక హోదా పైన ఆశలు పెట్టుకున్నారు. నిన్నటి దాకా హోదా ఇస్తామని దాని బాధ్యత మాదేనని చెప్పిన బీజేపీ ఒక్కసారిగా షాకిచ్చింది. హోదాతో సమానమైన ప్యాకేజీ ఇస్తామని చెప్పి చేత
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండేళ్లుగా ప్రత్యేక హోదా పైన ఆశలు పెట్టుకున్నారు. నిన్నటి దాకా హోదా ఇస్తామని దాని బాధ్యత మాదేనని చెప్పిన బీజేపీ ఒక్కసారిగా షాకిచ్చింది. హోదాతో సమానమైన ప్యాకేజీ ఇస్తామని చెప్పి చేతులు దులుపుకుంది.
అదే సమయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ హోదా బాధ్యత తమదేనని చెప్పారు. ఆ తర్వాత ప్యాకేజీ పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం హోదా కంటే ప్యాకేజీయే బెట్టర్ అని యూ టర్న్ తీసుకున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, ప్రధానంగా ప్రత్యేక హోదా అంశం పైనే 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజపీ - టీడీపీ కూటమికి మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఎదురు తిరిగారు. మరోవైపు జగన్ హోదా క్రెడిట్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. మొత్తానికి 2016లో ప్రత్యేక హోదా అంశంకు ఫుల్ స్టాఫ్ పడింది. అదే సమయంలో రాజకీయంగా వేడి రాజేసింది.

పవన్ కళ్యాణ్ ఎదుటే మోడీ హామీ
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అంతకుముందు యూపీఏ హయాంలో విభజన బిల్లు సమయంలో ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని నాటి రాజ్యసభ సభ్యులు, ప్రస్తుత కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పోరాడారు. ఆయనకు నాడు అరుణ్ జైట్లీ కూడా తోడయ్యారు. 2014 ఎన్నికల సమయంలో తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్, చంద్రబాబుల సమక్షంలో నరేంద్ర మోడీ హోదా పైన హామీ ఇచ్చారు. విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందని, హోదాతో తాము పూడ్చుతామని హామీ ఇచ్చారు.

రెండేళ్లుగా అదే మాట
ప్రత్యేక హోదా కోసం రెండేళ్లుగా ఏపీలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. హోదా కోసం ఎవరైనా డిమాండ్ చేసిన ప్రతిసారి బీజేపీ నాయకులు లేదా టిడిపి నాయకులు స్పందించేవారు. హోదా తమ బాధ్యత అని చెప్పేవారు. హోదాను తీసుకు వచ్చే బాధ్యత తమదేనని నమ్మబలికారు. బీజేపీ - టీడీపీ ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం, రాజ్యసభలో వెంకయ్య పదేళ్ల హోదా కోసం పోరాడిన నేపథ్యంలో చాలామంది బీజేపీ మాటలను విశ్వసించారు. రెండేళ్లుగా హోదా ఇస్తామని చెబుతూ వచ్చారు.

యూ టర్న్.. ట్విస్ట్
ప్రత్యేక హోదా కోసం విపక్షాలు నిత్యం డిమాండ్ చేస్తున్నాయి. హోదా ఆలస్యమవుతుందని కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు పార్లమెంటులోను నిలదీశాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రులు గత పార్లమెంటు సమావేశాలలో ప్రత్యేక హోదా పైన తేల్చేశారు. నిన్నటి దాకా హోదా బాధ్యత తమదేనని చెప్పిన బీజేపీ నేతలు ఆ తర్వాత సాంకేతిక కారణాలు చూపించి చేతులెత్తేశారు. హోదా అంశాన్ని కాంగ్రెస్ పార్టీ బిల్లులో పెట్టలేదని, ఆర్థిక సంఘం నో చెబుతోందని అంటూ తేల్చేశారు. అయితే, హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు.

చంద్రబాబు అసంతృప్తి, రివర్స్ గేర్
ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పినప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు తన అసంతృప్తిని వెళ్లగక్కారు. బీజేపీనే హోదా హామీని ఇచ్చిందని, దానిని నెరవేర్చకుంటే ఆ పార్టీకి పుట్టగతులు ఉండవని, ఏపీ ప్రయోజనాల కోసం బీజేపీతో సంబంధాలు తెంచుకవడానికి కూడా సిద్ధమని టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. అయితే, ఆ తర్వాత బీజేపీ నేతలు చంద్రబాబును, టిడిపిని కూల్ చేశారు.

ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ
హోదా ఇవ్వలేమని బీజేపీ ప్రకటించిన అనంతరం టిడిపి భగ్గుమంది. అయితే, బీజేపీ బుజ్జగింపు, హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని చెప్పిన అనంతరం చల్లబడింది. అంతేకాదు, కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి ఆ తర్వాత చేసిన ప్రకటన అందరికీ షాకిచ్చింది. హోదాతో ఉపయోగం లేదని, ప్రత్యేక ప్యాకేజీ వల్లనే లాభమని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని చెప్పారు.

బిజెపి, టిడిపిపై విమర్శలు
హోదా పైన యూ టర్న్ తీసుకున్న, హోదాకు బదులు ప్యాకేజీ బెట్టర్ అన్న టిడిపి పైన విపక్షాలైన వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, లెఫ్ట్, జనసేన పార్టీలు భగ్గుమన్నాయి. అప్పుడు హోదా బాగుంటుందని చెప్పిన వారు ఇప్పుడు దాంతో లాభం లేదని చెప్పడాన్ని ప్రశ్నించారు.

కేంద్రంతో అవసరమని టిడిపి
ప్రత్యేక హోదా ఇవ్వడానికి సాంకేతిక కారణాలు అడ్డు వస్తున్నాయని, అయినా హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని బీజేపీ ప్రకటించింది. తద్వారా తప్పును యూపీఏ ప్రభుత్వం పైకి నెట్టింది. అదే సమయంలో, హోదా ఇవ్వమని చెప్పిన బీజేపీతో కలిసి ఉండాల్సిన అవసరం ఏమీటని విపక్షాలు ప్రశ్నించగా.. టిడిపి కూడా సమాధానం చెబుతోంది. విభజన నేపథ్యంలో ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం అండ అవసరమని అంటున్నారు. అయినా హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని చెబుతున్నప్పుడు ఇంకా ఏమిటని, అలాగని తాము హోదాను వద్దని చెప్పడం లేదని, ప్యాకేజీ తీసుకుంటూ హోదా కోసం ఒత్తిడి తెస్తామని చెబుతంది.

రంగంలోకి జనసేన
అంతకుముందు రెండేళ్లు పవన్ కళ్యాణ్ రాజధాని భూములు తదితర సమస్యల పైన మాత్రమే స్పందించారు. హోదా పైన సమయం వచ్చినప్పుడు స్పందిస్తానని తెలిపారు. అయితే ట్విట్టర్ ద్వారా అప్పుడప్పుడు తన గళం వినిపించారు. ప్రత్యేక హోదా పైన బీజేపీ పూర్తి క్లారిటీ ఇచ్చాక ఆ పార్టీని నిలదీస్తానని పవన్ ఓ సందర్భంలో చెప్పారు.
పవన్ కళ్యాణ్ తాను చెప్పినట్లుగానే, పార్లమెంటు సాక్షిగా హోదా ఇవ్వమని కేంద్రమంత్రులు ప్రకటన చేశాక పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. జిల్లాల్లో హోదా గురించి వరుస సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత తిరుపతిలో, ఆ తర్వాత కాకినాడ, అనంతరం అనంతపురంలలో సభలు పెట్టారు. ముందు ముందు అన్ని జిల్లాల్లో సభలు పెట్టనున్నారు. 2014లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్.. హోదా పైన యూ టర్న్ తీసుకున్న ఆ పార్టీ పైన దుమ్మెత్తి పోస్తున్నారు.

బీజేపీ నేతల మౌనం
ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రమంత్రులు చెప్పినప్పటి నుంచి బీజేపీ నేతలు ఒకింత మౌనం పాటిస్తున్నారు. నిన్నటి దాకా హోదా బాధ్యత తమదేనని చెప్పారు. ఇప్పుడు కేంద్రం షాకిచ్చేసరికి వారు ఇరుకున పడిపోయారు. ఒకరిద్దరు మాట్లాడినా.. హోదా కంటే ప్యాకేజీయే బెట్టర్ అని, విభజన బిల్లులో హోదాను చేర్చక పోవడం వల్లనే ఇలా జరిగిందని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్‌కు శివాజీ సలహా
ప్రత్యేక హోదా కోసం నటుడు శివాజీ మొదటి నుంచి ఉద్యమిస్తున్నారు. బీజేపీ ఆలస్యం చేయడాన్ని ఆయన ఎప్పటికి అప్పుడు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే బీజేపీ కచ్చితంగా హోదా పైన ప్రకటన చేస్తుందని ఆయన చెప్పారు. పవన్ స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

కేవీపీ ప్రయివేటు బిల్లు
ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రయివేటు మెంబర్ బిల్లు పెట్టారు. దానిపై పార్లమెంటులో చర్చ అనంతరం ఆర్థిక బిల్లుగా తోసిపుచ్చారు. ఆర్థిక బిల్లును తొలుత లోకసభలో ప్రవేశ పెట్టాలని, ఆ తర్వాతే రాజ్యసభకు రావాలి. కేవీపీ పెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లు ఆర్థిక బిల్లు కాబట్టి రాజ్యసభ దానిని తిరస్కరించింది.

ఏం జరిగేనో?
రెండేళ్ల తర్వాత చూస్తే ప్రత్యేక హోదా వల్ల ఏపీలో పెను మార్పులు జరిగాయి. హోదా టిడిపి - బిజెపి మధ్య చిచ్చు రాజేస్తుందని భావించారు. కానీ తొలుత అసంతృప్తి వ్యక్తం చేసిన టిడిపి ఆ తర్వాత అనూహ్యంగా యూటర్న్ తీసుకుంది. హోదా క్రెడిట్‌ను సొంతం చేసుకోవాలని జగన్ తొలి నుంచి భావించారు. కానీ హఠాత్తుగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి జగన్‌ను కార్నర్ చేశారు. హోదాపై కాంగ్రెస్ పోరాడుతున్నప్పటికీ అది వెనుకబడిందనే చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications