గుండె తరుక్కుపోతోంది-పవన్, లోకేష్ ఎక్కడ ? ఆర్కే రోజా పైర్..
ఏపీలో వైసీపీ ఓటమి పాలయ్యాక కనిపించకుండా పోయిన మాజీ మంత్రి ఆర్కే రోజా ఇవాళ ఎంట్రీ ఇచ్చారు. తాజాగా తిరుమల దర్శనం రోజు కనిపించిన ఆమె.. ఇవాళ మరోసారి బెజవాడ వరదలపై స్పందిస్తూ వీడియో విడుదల చేశారు. ఇందులో ఆమె వరదల నియంత్రణ, సహాయక చర్యల విషయంలో ప్రభుత్వం, మంత్రుల తీరుపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడని ఆమె ప్రశ్నించారు.
విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుందని వైసీపీ నేత ఆర్కే రోజా తెలిపారు. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. వారి కష్టాలు వర్ణనాతీతమని, వారి మాటలు విటుంటే నాలుగురోజుల నుండి వాళ్లు ఎంత నరకం అనుభవించారో అర్థమవుతుందన్నారు. ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంత మంది ప్రాణాలు పోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపల్యమే కారణమని విమర్శించారు.

మంత్రులు విహార యాత్రలకు వెళ్లి...ప్రజలను వరదల్లో ముంచేశారని రోజా ఆరోపించారు. ఇదేదో విమర్శించడానికి చెప్తున్న మాట కాదని, ఏ టీవీ చూసినా, టీడీపీ చానళ్లు చూసినా ప్రజలు ఎంత నరక యాతన అనుభవిస్తున్నారో తెలుస్తుందన్నారు.జనాన్ని మూడు రోజుల పాటు ఎలా గాలికొదిలేశారో వాళ్ల మాటల్లోనే అర్థమవుతుందన్నారు. విజయవాడ మునిగిపోతుంటే ఈ ప్రభుత్వం ఐదురోజులైన కనీసం ఆహారం కూడా అందించడంలో విఫలం కావడం దారుణమన్నారు.
చంద్రబాబు ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు వచ్చినా కనీసం ప్రజలను ఆదుకోలేకపోయారంటే, ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఫల్యమని రోజా ఆరోపించారు. కనీసం గంట ముందు అప్రమత్తం చేసినా...విజయవాడ నగరంలోని ప్రజలు ముంపు బారిన పడేవారు కాదన్నారు. నాలుగు రోజుల పాటు కరెంట్ లేకుండా, నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా కష్టాలు పడ్డారంటే ఇంతకంటే ఘోరమైన వైఫల్యం మరొకటి ఉండదన్నారు.
ముఖ్యమంత్రి, మంత్రులకు వీకెండ్ విహార యాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు కానీ, ప్రజల కష్టాల కోసం ఆలోచించడం లేదని రోజా విమర్శించారు. ఈనెల 29,30 వ తేదీల్లో సీఎం నుండి మంత్రుల వరకు అందరూ వీకెండ్ విహార యాత్రలకు ప్లాన్ చేసుకున్నారని, 28 వ తేదీనాడే వాతావరణ శాఖ భారీ వర్షాలు పడతాయి అయినా సమాచారం ఇచ్చినా కనీసం సీఎం చంద్రబాబు కానీ హోంమంత్రి కానీ, పంచాయతీరాజ్ మంత్రి కానీ, రెవెన్యూ మంత్రికానీ, మున్సిపల్ శాఖ మంత్రి కానీ, ఇరిగేషన్ మంత్రి కానీ, ఒక్కరంటే ఒక్కరు కూడా ఎలాంటి సమీక్ష చేయలేదన్నారు.
జగనన్న ప్రభుత్వం లో ఉన్నప్పుడు వర్షాలు, వరదలు, తుఫాన్లు వస్తాయన్న సమాచారం ఉంటే..ముందుగానే సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలను అప్రమత్తం చేసే వాళ్లమని రోజా గుర్తుచేసుకున్నారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఆహారం, పాలు, మంచినీళ్లు అందించేవాళ్లమన్నారు. వరద, తుఫాన్ బాధితులకు వాళ్ల ఇళ్లకు కూడా ఆహారం, నిత్యవసరాలు పంపిణీ చేసేవాళ్లమని, జగనన్న నిరంతరం అధికారులతో సమీక్షలు జరిపి, ఆయన చుట్టూ అధికారులను తిప్పుకోకుండా ప్రజలకు ముందు సహాయ చర్యలు అందేలా చేసేవారని తెలిపారు.
పంచాయతీరాజ్ శాఖమంత్రి పవన్ కళ్యాణ్ ఐదు రోజులైనా ఇంకా విజయవాడ వెళ్లలేదని, కనీసం వరదలపై ఆయన శాఖ అధికారులతోను, సహాయ చర్యలపైనా సమీక్ష చేయలేదన్నారు. ఇలా మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ జనాన్ని ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా గాలికివదిలేశారని రోజా విమర్శించారు.












Click it and Unblock the Notifications