RRR మేకర్స్ మాట సీఎం జగన్ వింటారా - జూ ఎన్టీఆర్ కోసం అంగీకరిస్తారా...!!
తెలుగు సినీ పరిశ్రమ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏంటో అర్దమైంది. ఆయనతో సమరం కంటే సంధి సరైన మార్గమని గుర్తించింది. అందుకే కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఒక వైపు ప్రభుత్వం పైన సినీ పరిశ్రమ అంశంలో ఫైర్ అవుతుండగానే..మరో వైపు సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వంతో సంధి కోసం ప్రయత్నించారు. పవన్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని తేల్చి చెప్పేశాయి.
తెలుగు ఫిలం ఛాంబర్ సైతం అదే విషయాన్ని స్పష్టం చేసింది. ఇక, నిర్మాతలు...ఎగ్జిబిటర్లు వరుసగా ఏపీ మంత్రి పేర్ని నానితో సమావేశమయ్యారు. అందరూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్ లైన్ టిక్కెట్ల విధానాన్ని ఆమోదించారు. ఇక, ఇప్పుడు ఇదే సమయంలో ఆర్ఆర్ఆర్ మూవీ ఎపిపోడ్ తెర మీదకు వచ్చింది.

450 కోట్ల రూపాయల ఖర్చుతో ఆర్ఆర్ఆర్
పాన్ ఇండియా మూవీగా దాదాపు 450 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ మూవీ సిద్దం అవుతోంది. జనవరిలో సినిమా విడుదలకు ముహూర్తం నిర్ణయం తీసుకున్నారు. ఇంత భారీ బడ్జెట్.. మార్కెట్ లో ఉన్న పరిస్థితుల్లో టిక్కెట్ల ధరల విషయం మూవీ మేకర్స్ లో గుబులు పుట్టిస్తోంది.
ఏపీలో టిక్కెట్ల ధరల పెంపుకు అనుమతి లభించకపోతే నష్టం తప్పదనే అభిప్రాయం ఆర్ఆర్ఆర్ మూవీ మేకర్స్ లో కనిపిస్తోంది. దీంతో..ఈ అంశం పైన మూవీ మేకర్స్ న్యాయస్థానంకు వెళ్తారని ప్రచారం సాగింది. కానీ, ఆ సినిమా నిర్మాత దీని పైన స్పష్టత ఇచ్చారు. తాము కోర్టుకు వెళ్లటం లేదని ..సరైన పరిష్కారం చూపమంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలుస్తామంటూ ట్వీట్ చేసారు.

టిక్కెట్ల ధరల పెంపు కోసం వినతులు
అయితే, ఈ సినిమా ఇద్దరు గిరిజన చారిత్రక పోరాట వీరుల సినిమా కావటంతో...ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించి ధరలు పెంచుకొనేందుకు అవకాశం ఇవ్వాలని కోరేందుకు సిద్దపడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ముఖ్యమంత్రి జగన్ టిక్కెట్ల ధరలను పెంచుకొనేందుకు వారు కోరిన విధంగా అంగీకరిస్తారా లేదా అనేది ఇప్పడు పొలిటికల్ సర్కిల్స్ లో..అటు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఈ సినిమాలో రాం చరణ్..జూనియర్ ఎన్టీఆర్ హీరోలు గా నటిస్తుండగా.. రాజమౌళి దర్శకుడుగా ఉన్నారు.

జూ ఎన్టీఆర్ పైన అభిమానంతో లాబీయింగ్ చేస్తారా
గతంలో చిరంజీవి నాయకత్వంలో సినీ ఇండస్ట్రీ సమస్యల పైన సీఎం కలిసినప్పుడు రాజమౌళి జగన్ వద్దకు వచ్చారు. ఇక, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ మూవీలో ఉండటంతో ..ఆయన్ను అమితంగా ప్రేమించే కేబినెట్ లోని కీలక మంత్రి జోక్యం చేసుకుంటారనే ప్రచారం సాగుతోంది. ఆ మంత్రితో పాటుగా ఆయనకు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యే సైతం జూనియర్ కోసం సీఎంను ఒప్పించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు..ఆయన కుమారుడు లోకేశ్ ను తీవ్రంగా విమర్శించే ఆ ఇద్దరూ ఎన్టీఆర్ కుటుంబం పైన మాత్రం గౌరవం చూపిస్తారు.

జగన్ నిర్ణయంలో మార్పు ఉంటుందా
అయితే, ప్రభుత్వ పాలసీ పరపమైన నిర్ణయం లో వారు ఈ మూవీ కోసం జోక్యం చేసుకుంటారా లేదా అనేది కీలకంగా మారుతోంది. ఒక్క సినిమాకు అధిక ధరలకు అవకాశం ఇస్తే..ఇతర సినిమాల నిర్మాతల నుంచీ ఇదే రకమైన ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, సీఎం జగన్ ఒక నిర్ణయం తీసుకున్న తరువాత అంత త్వరగా ఎవరు ఒత్తిడి చేసినా తన నిర్ణయం మార్చుకోరని పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం పైన సినీ ఇండస్ట్రీ ని వేధిస్తుందనే విమర్శల సమయంలోనూ ఎక్కడా సీఎం నేరుగా స్పందించ లేదు.

నాడు వకీల్ సాబ్ ..నేడు ఆర్ఆర్ఆర్
కానీ, ప్రభుత్వానికి సినీ పరిశ్రమ నుంచే మద్దతు వచ్చేలా చేయగలిగారు. దీంతో..ఇప్పుడు చిరంజీవి తనయుడు సైతం ఈ మూవీ లో హీరోగా ఉండటంతో..జగన్ ఈ ఇద్దరి కోసం నిర్ణయం పైన పునరాలోచన చేసే అవకాశం ఉందనేది మరో టాక్. దీంతో...ఇప్పుడు ఈ మూవీ నిర్మాతలు నేరుగా సీఎం ను కలవాలని నిర్ణయించటంతో... వారు కోరుకున్న విధంగా సీఎంతో చర్చిస్తారా..లేక, ఆ చర్చలు మంత్రి పేర్ని నానితో పరిమితం అవుతాయా అనేది చూడాల్సి ఉంది.
మొత్తంగా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ మీద ఏ స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయో.. అదే స్థాయిలో నిర్మాతలు సైతం టిక్కట్ల రేట్ల విషయంలో ఏపీ సీఎం మీద ఆశలు పెట్టుకున్నారు. మరి..సీఎం జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో అనే ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications